ఫేస్‌‘బుక్‌’ అవుతారు జాగ్రత్త! JobCorner-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఫేస్‌‘బుక్‌’ అవుతారు జాగ్రత్త!
ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, లింక్డిన్‌ వంటి సామాజిక మాధ్యమాలు మన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. ఇతరులతో అభిప్రాయాలను పంచుకోవడం, ఇష్టమైన వాటిని షేర్‌ చేసుకోవడం వంటివి సోషల్‌ మీడియా (సామాజిక మాధ్యమం) కారణంగా చాలా సులభంగా మారాయి. ఆయా మాధ్యమాలను వేదికగా చేసుకొని వ్యవహరించే తీరును బట్టి మన వ్యక్తిత్వంపై ఒక అంచనాకు వచ్చే పరిస్థితులను సామాజిక మాధ్యమాలు సృష్టించాయి. అందుకే ప్రస్తుతం ఎంప్లాయర్స్‌ రెజ్యూమెతోపాటు ఉద్యోగార్థుల ఆన్‌లైన్‌ యాక్టివిటీని కూడా నిశితంగా గమనిస్తున్నారు. ఆన్‌లైన్‌ యాక్టివిటీ మన కెరీర్‌ను ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ఒక వారధిగా, సమయస్ఫూర్తితో ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగార్థులు... ఎలాంటి తేడా వచ్చినా కెరీర్‌ మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.
 
రిక్రూట్‌మెంట్‌ విధానం మారుతోంది. గతంలోని సంప్రదాయ పద్ధతుల స్థానంలో డిజిటల్‌ హైరింగ్‌కు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. తద్వారా సమయం, ఖర్చు ఆదా అవుతున్నాయి. ప్రస్తుతం అప్లికెంట్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ ద్వారా రెజ్యూమె స్ర్కీనింగ్‌ ప్రాసెస్‌ను పూర్తి చేస్తున్నారు. మానవ ప్రమేయం లేకుండా కేవలం మెషిన్‌ మాత్రమే ఈ బాధ్యతను నిర్వహిస్తుంది. జాబ్‌ రోల్‌, రిక్వైర్‌మెంట్స్‌ ఆధారంగా డిజైన్‌ చేసిన ప్రోగ్రామ్‌ ఆధారంగా మెషిన్‌ ఈ ప్రాసెస్‌ను నిర్వర్తిస్తుంది. కాబట్టి ఉద్యోగాన్వేషణలో ఆన్‌లైన్‌ / సోషల్‌ మీడియాను ప్రభావవంతంగా ఉపయోగించుకోవాలి.
 
92 శాతం కంపెనీలు
ఉద్యోగం కోసం ఏదైనా కంపెనీకి రెజ్యూమెను ఫార్వర్డ్‌ చేసిన తరవాతే అసలు పని మొదలవుతుంది. రెజ్యూమె ఆధారంగా సామాజిక మాధ్యమాలలో ప్రవర్తనను గమనించే పనిని హెచ్‌ఆర్‌ మేనేజర్లు ప్రారంభిస్తారు. సామాజిక మాధ్యమాలలో మీ పేరును సెర్చ్‌ చేస్తే వచ్చే స్టఫ్‌ హుందాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ సందర్భాల్లో చేసిన పోస్టింగ్స్‌, కామెంట్స్‌ల్లో అనవసరమైన వాటిని తొలగించాలి. ఆన్‌లైన్‌లో మంచి రెప్యూటేషన్‌ క్రియేట్‌ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రస్తుతం 92 శాతం కంపెనీలు రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌లో స్ర్కీనింగ్‌ కోసం ఫేస్‌బుక్‌, లింక్డిన్‌, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నాయి. రిక్రూట్‌మెంట్‌ కోసం అత్యధిక మంది ఎంప్లాయర్స్‌ లింక్డిన్‌ సోర్స్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు.
 
ఆన్‌లైన్‌ ప్రొఫైల్‌
ప్రస్తుతం రిక్రూటర్లు ఆన్‌లైన్‌ ప్రొఫైల్స్‌ ద్వారా తమకు కావల్సిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసుకుంటున్నారు. కాబట్టి మీకు సంబంధించిన పూర్తి వివరాలు.. అంటే అర్హతలు, నైపుణ్యాలు, విజయాలు, గత అనుభవం వంటి అంశాలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. రిక్రూటర్లు రెజ్యూమెలో మీరు పొందుపరచిన వివరాలతో పాటు మరింత అదనపు సమాచారం కోసం ఆన్‌లైన్‌ / సోషల్‌ మీడియాలో మీ వివరాలను పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి ఆన్‌లైన్‌ ప్రొఫైల్‌ను జాబ్‌ సెర్చ్‌కు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. జాబ్‌ / ఇండస్ర్టీకి సంబంధించిన కీ వర్డ్స్‌ ప్రొఫైల్‌లో ఉండేలా చూసుకోవాలి.
 
సాదాసీదాగా
స్ర్కీన్‌ నేమ్‌ కూడా సాదాసీదా ఉండేలా చూసుకోవాలి. ఎటువంటి డిజైన్స్‌ / యానిమేషన్స్‌ లేకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే డిజైన్స్‌ ఒక రకమైన నెగిటివ్‌ అభిప్రాయాన్ని కలుగజేస్తాయి. అదేవిధంగా ప్రొఫైల్‌కు ప్రొఫెషనల్‌ లుక్‌ వచ్చే హెడ్‌లైన్‌ను ఉపయోగించాలి. ఉదాహరణకు... ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్‌ లుకింగ్‌ ఫర్‌ మార్కెటింగ్‌ జాబ్‌, గ్రాడ్యుయేట్‌ ఇన్‌ ఫార్మాస్యూటికల్‌ విత్‌ టూ ఇయర్స్‌ ఎక్స్‌పీరియెన్స్‌, గ్రాడ్యుయేట్‌ లుకింగ్‌ ఫర్‌ ఏ జాబ్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ విత్‌ టు ఇయర్స్‌ ఎక్స్‌పీరియెన్స్‌ విల్లింగ్‌ టూ రిలొకేట్‌. అదేవిధంగా ప్రొఫైల్‌కు సంబంధించి బ్యాగ్రౌండ్‌ ప్లెయిన్‌గా, బ్లాక్‌ టెక్ట్స్‌తో ఉండేలా చూసుకోవాలి.
 
అప్‌ టు డేట్‌
ప్రస్తుతం ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా, ఫెక్సిబుల్‌ ఆటిట్యూడ్‌తో ఉండే వారిని రిక్రూట్‌ చేసుకోవడానికి ఎంప్లాయర్స్‌ ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి జాబ్‌ సెర్చ్‌ దిశగా ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఆన్‌లైన్‌ ప్రొఫైల్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తుండాలి. ఎందుకంటే వస్తున్న మార్పులకనుగుణంగా సంబంధిత అంశాల్లో మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే భావన దీని ద్వారా ఏర్పడుతుంది. స్కిల్స్‌ను అప్‌డేట్‌ చేసుకుంటూ తదనుగుణంగా ప్రొఫైల్‌ను మార్పు చేసుకోవాలి. చాలాకాలంగా ఎలాంటి అప్‌డేట్‌ లేకుండా స్థిరంగా ఉండే రెజ్యూమె పట్ల ఎంప్లాయర్స్‌ అంతగా ఆసక్తి చూపించరు.
 
విమర్శించడం కోసం కాదు
మనలోని భావాలను ఇతరులతో పంచుకోవడానికి సామాజిక మాధ్యమం చక్కటి వేదిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఎదుటివారిని విమర్శించడం వంటి వ్యవహారాలకు సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించుకోవడం సరైన ఆలోచన కాదు. ఉదాహరణకు మీరు పని చేస్తున్న ఆఫీస్‌లో యాజమాని లేదా సహచరుల ప్రవర్తన మీకు ఇబ్బందిగా ఉందనుకుందాం. దాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకోవడం వల్ల విషయం మరింత దిగజారుతుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. అప్పటి వరకు మీపై సదభిప్రాయంతో ఉన్నవారు కూడా దీన్ని హర్షించరు. అందువల్ల ఆఫీసులో విషయాలను సామాజిక మాధ్యమాల్లో చర్చించవద్దు.
 
వివాదాలకు దూరంగా...
సామాజిక మాధ్యమం వేదికగా ఎవరు ఎలాంటి అభిప్రాయం అయినా వ్యక్తం చేయవచ్చు. కాకపోతే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు విచక్షణతో వ్యవహరించాలి. మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలు కులం, మతం, ప్రాంతం, జాతి ఇలా ఏ ఒక్కరినీ కూడా ఉద్దేశించినవిగా ఉండకూడదు. సాధ్యమైనంత వరకు వివాదస్పద అంశాలకు జోలికి వెళ్లకపోవడం మంచిది. వ్యక్తం చేసే అభిప్రాయం ఎవ్వరినీ నొప్పించకుండా అందరూ అంగీకరించేలా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగార్థులు కెరీర్‌కు సంబంధించిన కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
 
స్వల్ప వ్యవధిలోనే..
సామాజిక మాధ్యమాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ చాలా ఎక్కువ. అలా అని ఏమి పోస్ట్‌ చేసినా, షేర్‌ చేసినా ఏమీకాదు అనే ధోరణి సరికాదు. స్వల్ప వ్యవధిలోనే ఎంతో ప్రభావం చూపే సామాజిక మాధ్యమాల్లో చట్ట విరుద్ధ కార్యకలాపాలకు అవకాశం ఇచ్చే అంశాలు, ఫోటోలను పోస్ట్‌ చేయకూడదు. ఇవి మీ వ్యక్తిగత ప్రతిష్ఠను దిగజారుస్తాయి. అంతేకాకుండా చట్టపరంగా కూడా అనేక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.
 
ప్రభావవంతంగా
మీ కెరీర్‌కు సంబంధించిన నిపుణులు, ప్రముఖులతో నిత్యం ఇంటరాక్ట్‌ కావడానికి సామాజిక మాధ్యమాలు చక్కని వేదికలు. కొత్త విషయాలు నేర్చుకోవడం, కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి అవసరమైన సలహాలను స్వీకరించడం వంటి వాటికి సామాజిక మాధ్యమాన్ని ప్రభావవంతంగా వినియోగించుకోవాలి. సంబంధిత రంగంలోని ప్రొఫెషనల్స్‌ మీ నెట్‌వర్క్‌లో ఉండేలా చూసుకోవాలి. ఏ రంగంలో పని చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన కంపెనీల ప్రొఫైల్స్‌ను నిత్యం ఫాలో కావాలి. సంబంధిత నిపుణులతో నిత్యం టచ్‌లో ఉండేం దుకు ప్రయత్నించాలి. తద్వారా వారిలో ఎవరైనా తమ దృష్టిలో ఉన్న అవకాశాలకు మిమ్మల్ని సూచించవచ్చు.
 
ఉద్యోగార్థులపై ప్రభావం
వ్యక్తిగత జీవితాన్ని సామాజిక మాధ్యమంతో ముడిపెట్టొద్దు. ప్రస్తుతం ప్రతి చిన్న విషయాన్ని కూడా సామాజిక మాధ్యమంలో పంచుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటోంది. కాబట్టి సమస్యలు, సంబంధాలు, వ్యక్తిగత అంశాలు వంటి వాటిని పోస్ట్‌ చేస్తున్నప్పుడు విచక్షణతో వ్యవహరించాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే ఇవి చూపే ప్రభావం ఎక్కువ. కాబట్టి వ్యక్తిగత జీవితానికి, సామాజిక మాధ్యమానికి మధ్య అంతరాన్ని గమనించాలి.
ముఖ్యంగా ఉద్యోగార్థులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజిక మాధ్యమాన్ని వేదికగా చేసుకొని వ్యక్తం చేసే అభిప్రాయాలు, షేరింగ్స్‌ వంటి వాటి ఆధారంగా రిక్రూటర్లు మీ వ్యక్తిత్వంపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఇవి అవకాశాలను కూడా ప్రభావితం చేయవచ్చు. కాబట్టి మీ కెరీర్‌కు ఉపయోగపడే అంశాలను షేర్‌ చేసుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
 
ఒకే విధమైన సమాచారం
ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, లింక్డిన్‌లలో ఉద్యోగాన్వేషణకు సంబంధించి పోస్ట్‌ / షేర్‌ చేస్తున్న ప్రొఫైల్‌ / రెజ్యూమెలోని సమాచారం ఒకే విధంగా ఉండేలా జాగ్రత్తపడాలి. రిక్రూటర్లు స్ర్కీనింగ్‌ కోసం కేవలం ఒకే సోర్స్‌కు పరిమితం కారు. అందుబాటులోని అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటారు. ఈ సమయంలో ఆయా సోర్సుల్లోని సమాచారం ఒకదానికి ఒకటి పరస్పర విరుద్ధంగా ఉంటే అవకాశం చేజారిపోవచ్చు.
 
సందర్భోచితంగా షేర్‌
సందర్భోచితంగా ఇమేజెస్‌ను షేర్‌ చేసుకోవడంలో తప్పు లేదు. పెళ్లి, పుట్టిన రోజు లాంటి ప్రత్యేక సందర్భాల్లో బంధువులు, స్నేహితులతో కలిసి ఉన్న క్షణాలను ఇతరులతో పంచుకోవచ్చు. అంతేకానీ పబ్‌, క్లబ్‌ లేదా మరోచోట పార్టీ చేసుకుంటున్న ఫోటోలు, అభ్యంతరకరమైన ఇమేజెస్‌ను పోస్ట్‌ చేయడం వల్ల మీపై ఒక రకమైన నెగిటివ్‌ భావన ఏర్పడుతుంది. ఉద్యోగార్థులు ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. పార్టీ చేసుకోవడంలో తప్పు లేదు. కాకపోతే వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడం వల్ల మీపై ఒక రకమైన ముద్ర పడిపోతుంది.
 
వీటికి దూరంగా....
అసంబద్ధమైన ఫోటోలు లేదా సమాచారాన్ని షేర్‌ చేయకూడదు.
తాగుడు, డ్రగ్స్‌ అలవాట్లు ఉన్నట్లు నిరూపించే ఆధారాలను పోస్ట్‌ చేయవద్దు.
చేసే పోస్ట్‌లు / వ్యాఖ్యలు కులం, మతం, ప్రాంతం, జాతి ఇలా ఏ ఒక్కరిని కూడా ఉద్దేశించినవిగా ఉండకూడదు.
రాజకీయంగా, సామాజికంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలను లైక్‌ / షేర్‌ చేయరాదు.
 
ఇలా చేస్తే ప్రయోజనం
సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే కంటెంట్‌ మన కెరీర్‌కు ఉపయోగపడేలా ఉండాలి.
ఎంప్లాయర్‌ మన ప్రొఫైల్‌ను చూసినప్పుడు ప్రొఫెషనల్‌ లుక్‌ కనిపించాలి.
ప్రొఫైల్‌లో ఉంచే సమాచారం సంబంధిత రంగానికి చెందినదై ఉండాలి.
అర్హత, అనుభవంతోపాటు అదనపు నైపుణ్యాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా జోడించాలి.
ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌, కాలేజీ / ఉద్యోగ జీవితంలో సాధించిన ప్రత్యేకమైన విజయాలు ఉంటే వాటిని కూడా ప్రొఫైల్‌లో ఉండేలా చూసుకోవాలి.
సాధ్యమైనంత వరకు వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకపోవడం మంచిది.