సామర్థ్యాలకు సవాల్‌..సైబర్‌ సెక్యూరిటీ JobCorner-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
సామర్థ్యాలకు సవాల్‌..సైబర్‌ సెక్యూరిటీ
‘వన్నాక్రై’ గుర్తుందా... ఐదారు నెలల కిందట 150 దేశాలను గడగడలాడించిన రాన్సమ్‌వేర్‌. మనదేశంలో ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, కేరళ, పశ్చిమ బంగ రాష్ట్రాల్లోని ప్రభుత్వ వెబ్‌సైట్లు దీనివల్ల హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఏపీలో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వెబ్‌సైట్‌కే భద్రత లేకుండా పోయింది. ఆధార్‌ డేటా లీక్‌ అవడం కూడా సైబర్‌ సెక్యూరిటీ లోపాలను బహిర్గతం చేసింది.
 
ఓవైపు అంతా ఆన్‌లైన్‌ మయం అవుతుంటే... మరోవైపు ఆన్‌లైన్‌లో సమాచారానికి భద్రత పెద్ద సమస్యగా మారుతోంది. అందుకే సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. సైబర్‌ దాడుల నుంచి తమ సర్వర్లను, డేటా కాపాడుకోవడానికి కంపెనీలు సైబర్‌ సెక్యూరిటీ నిపుణులను నియమించుకుంటున్నాయి. ఈ రంగంలో లభించే ఉద్యోగ అవకాశాలు, కావాల్సిన నైపుణ్యాలు తదితర అంశాలపై విశ్లేషణ..
 
మన దేశం డిజిటలైజేషన్‌ దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. అయితే మౌలిక సదుపాయాల కొరత, ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడంతో సైబర్‌ స్పేస్‌ వినియోగంలో భద్రతపరంగా పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల వెబ్‌సైట్లను హ్యాక్‌ చేసి సమాచారాన్ని తస్కరించడం, స్నిప్పింగ్‌, స్ఫూపింగ్‌ తదితర టెక్నిక్స్‌ ద్వారా వెబ్‌సైట్‌ను బ్లాక్‌ చేయడం పెరుగుతోంది. ఏటీఎం, వాలెట్స్‌, ఆన్‌లైన్‌ లావాదేవీలు, ఈ-బ్యాంకింగ్‌ వంటి వాటి వినియోగం పెరిగిన నేపథ్యంలో సైబర్‌ సెక్యూరిటీ సవాలుగా మారుతోంది. ఈ సవాలు నిపుణులకు కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది.
 
సైబర్‌ సెక్యూరిటీ అంటే
కంప్యూటర్స్‌, నెట్‌వర్క్స్‌, ప్రోగామ్స్‌, డేటాను వివిధ రకాల సైబర్‌ దాడుల నుంచి కాపాడేందుకు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని సైబర్‌ సెక్యూరిటీగా వ్యవహరిస్తారు. ఇందులో అప్లికేషన్‌ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, డిజాస్టర్‌ రికవరీ, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ వంటి అంశాలు ఇమిడి ఉంటాయి.
 
నిపుణుల కొరత ఎక్కువ
ప్రపంచాన్నే శాసిస్తున్న టెక్‌ రెవల్యూషన్‌ ఇంటర్నెట్‌. భవిష్యత్‌లో జరిగే ప్రతి ఆవిష్కరణ ఇంటర్నెట్‌ కేంద్రంగానే ఉండబోతోంది. ఎలక్ర్టానిక్‌ గాడ్జెట్స్‌ రూపకల్పన, ప్రొడక్ట్‌ బ్రాండింగ్‌ వంటి అన్నిటికి ఆన్‌లైన్‌ మాధ్యమాలే ఆధారంగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా సూపర్‌ మార్కెట్ల నుంచి ఐటీ కంపెనీల వరకు ఇలా ప్రతి రంగంలో వెబ్‌సైట్‌, యాప్స్‌, బ్లాగ్స్‌, సోషల్‌ నెట్‌వర్క్‌ (ఫేస్‌బుక్‌, లింక్డిన్‌ వంటివి) వంటి సాంకేతిక వ్యవస్థల ద్వారా వినియోగదా రులకు సేవలను అందిస్తున్నాయి.
 
దీంతో ఆయా సంస్థలు సైబర్‌ దాడులు, హ్యాకింగ్‌ రూపంలో ఎదురయ్యే సవాళ్లను
ఎదుర్కొవడానికి సైబర్‌ సైక్యూరిటీ నిపుణులు తప్పకుండా నియమించుకుంటున్నాయి. అయినప్పటికీ డిమాండ్‌కు సరిపడ సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు అందుబాటులో లేరని వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సెంటర్‌ ఫర్‌ సైబర్‌ సేఫ్టీ అండ్‌ ఎడ్యుకేషన్‌ అధ్యయనం మేరకు 2022 నాటికి కావల్సిన దాని కంటే 1.8 మిలియన్ల మంది సైబర్‌ నిపుణుల కొరత ఉంటుందని అంచనా. ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ ఆడిట్‌ అండ్‌ కంట్రోల్‌ అసోసియే షన్‌ నివేదిక ప్రకారం 2019 నాటికి ప్రపంచవ్యాప్తంగా కావల్సిన దాని కంటే రెండు మిలియన్ల మంది సైబర్‌ నిపుణులు తక్కువగా ఉంటారు. ఏటా అమెరికాలోని కంపెనీలకు 40 వేల మంది సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు అవసరం. ఇందులో 20 వేల ఉద్యోగాలను భర్తీ చేయడం కష్టంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా 2021 నాటికి 3.5 మిలియన్ల మంది సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు అవసరం.
 
ప్రతి రంగంలో
ప్రస్తుతం సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల అవసరం ప్రతి రంగానికీ ఉంది. దీంతో రెగ్యులర్‌ లేదా అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో వీరిని నియమించుకుంటున్నాయి. ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌, ఫార్మా కంపెనీలు, మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్స్‌, సాఫ్ట్‌వేర్‌ / హార్డ్‌వేర్‌/ ఐటీ సంస్థలు, హెల్త్‌కేర్‌, రిటైల్‌ అవుట్‌లెట్స్‌ వంటి రంగాల్లోని కంపెనీలు సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, ఫోరెన్సిక్‌ కంప్యూటర్‌ అనలిస్ట్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్‌, టెస్టర్‌, ఐటీ సెక్యూరిటీ ఇంజనీర్‌, సెక్యూరిటీ సిస్టమ్స్‌ అడ్మినిస్ర్టేటర్‌, ఐటీ సెక్యూరిటీ కన్సల్టెంట్‌ వంటి హోదాలు సైబర్‌ సెక్యూరిటీ రంగంలో ఉంటాయి.
 
కావల్సిన నైపుణ్యాలు
కంప్యూటర్స్‌, ఆన్‌లైన్‌ సైట్స్‌పై సుదీర్ఘ సమయం గడిపే ఆసక్తి ఉన్న వారికి ఈ కెరీర్‌ చక్కగా సరిపోతుంది. ఇందుకు దోహదం చేసే నైపుణ్యాలు..
  • లినక్స్‌, యూనిక్స్‌లపై కనీస అవగాహన
  • వెబ్‌ అప్లికేషన్‌, సిస్టమ్‌ అడ్మినిస్ర్టేషన్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, నెట్‌వర్కింగ్‌ కాన్సెప్ట్‌లపై పట్టు
  • వైర్‌లెస్‌ టెక్నాలజీస్‌పై ప్రాథమిక పరిజ్ఞానం
  • కోడింగ్‌ స్కిల్స్‌
 
సర్టిఫికెట్‌ కోర్సులు...
సైబర్‌ సెక్యూరిటీ రంగంలో ఉన్నతంగా స్థిరపడాలనుకునే వారికి సర్టిఫికెట్‌ కోర్సులు చాలా ఉపయోకరంగా ఉంటాయి. వాటిల్లో కొన్ని..
 
సీఐఎస్‌ఎస్‌పి: సర్టిఫైడ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్‌ (సీఐఎస్‌ఎస్‌పీ). సైబర్‌ సెక్యూరిటీ రంగంలో పని చేయాలనుకునే వారికి ఈ సర్టిఫికెట్‌ కీలకం. తద్వారా ఈ రంగంలో మెరుగైన స్థాయి, వేతనంతో కెరీర్‌ ప్రారంభించవచ్చు.
 
సీఐఎస్‌ఎం: సర్టిఫైడ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ మేనేజర్‌ (సీఐఎస్‌ఎం). గవర్నెన్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, కాంప్లియెన్స్‌ వంటి అంశాలపై ఇందులో శిక్షణ ఇస్తారు.
 
సీఐఎస్‌ఎ: ఆడిటింగ్‌, కంట్రోలింగ్‌, మానిటరింగ్‌, అసెసింగ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ వంటి అంశాల్లో శిక్షణ ఉంటుంది. సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు ఈ అంశాలపై అవగాహన తప్పనిసరిగా ఉండాలి.
 
జీఐఏసీ: గ్లోబల్‌ ఇన్ఫర్మేషన్‌ అస్యూరెన్స్‌ సర్టిఫికేషన్‌ (జీఐఏసీ). ఇంట్రూషన్‌ డిటెక్షన్‌, ఫోరెన్సిక్‌ వంటి సాంకేతిక అంశాలపై ఈ కోర్సులో శిక్షణనిస్తారు.
 
సీఈహెచ్‌: సర్టిఫైడ్‌ ఎథికల్‌ హ్యాకర్‌ (సీఈహెచ్‌). సైబర్‌ సెక్యూరిటీలో ఎంట్రీ స్థాయి ఉద్యోగాల్లో ప్రవేశించడానికి ఈ సర్టిఫికెట్‌ ప్రయోజనకరంగా ఉంటుంది.
 
ఆకర్షణీయంగా వేతనాలు
ఇతర రంగాలతో పోల్చితే సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయని చెప్పొచ్చు. సైబర్‌ సెక్యూరిటీ ప్రాధాన్యత అంశంగా మారిన క్రమంలో సెక్యూరిటీ డెవలపర్స్‌, సెక్యూరిటీ ప్రోగ్రామర్స్‌కు లక్షల్లో వేతనాలు చెల్లించి మరీ కంపెనీలు నియమించుకుంటున్నాయి. ఒక అధ్యయనం మేరకు మన దేశంలో సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల సరాసరి వార్షికాదాయం రూ.7.8 లక్షలు. ఫ్రెషర్స్‌కు ఏడాదికి రూ.3-4 లక్షల మధ్యలో వేతనాలు ఉంటున్నాయి.
 
ప్రవేశం ఇలా
సైబర్‌ సెక్యూరిటీ కెరీర్‌లో ప్రవేశించాలంటే కంప్యూటర్‌ సైన్స్‌, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌, ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉండాలి. సర్టిఫికెట్‌ కోర్సులను చేయడం ప్రయోజనకరం. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సింప్లిలెర్న్‌, ఉదేమై వంటి సంస్థలు సీఐఎస్‌ఎస్‌పీ, సీఐఎస్‌ఎం (సర్టిఫైడ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ మేనేజర్‌), సీసీఎస్‌పీ వంటి సర్టిఫికెట్‌ కోర్సులను ఆన్‌లైన్‌ ద్వారా ఆఫర్‌ చేస్తున్నాయి.
 
ఎక్కడ చదవాలి?
మన దేశంలో చాలా సంస్థలు సైబర్‌ సెక్యూరిటీ / సంబంధిత అంశంలో గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, సర్టిఫికెట్‌ తదితర కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి. వాటిలో కొన్ని..
 
సి - డాక్‌ సెంటర్లు
ఐఐఐటి - హైదరాబాద్‌
ఐఐఐటి - గౌహతి ఝ నిట్‌ - మంగళూరు
థాపర్‌ యూనివర్సిటీ - పాటియాలా
 
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐఐటీ - భువనేశ్వర్‌ ఎంటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌లో నెట్‌వర్కింగ్‌ సైబర్‌ సెక్యూరిటీ సబ్‌ స్పెషలైజేషన్‌తో) కోర్సును ప్రారంభించనుంది.
ఐఐటీ - ఢిల్లీ - ఈ రంగంలో శిక్షణ కారక్రమాలను నిర్వహిస్తుంది.
సైబర్‌ సెక్యూరిటీ అంశంపై ఇంటెల్‌, గూగుల్‌ వంటి సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ కూడా చేయవచ్చు.
కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశానికి తగిన ప్రాధాన్యం ఇస్తుంది. ఇందుకోసం స్కిల్‌ డెవలప్‌ మెంట్‌లో భాగంగా సైబర్‌ సెక్యూరిటీపై శిక్షణను కూడా ఇస్తుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఆర్టస్‌ ఎల్‌ఎల్‌సి వంటి కంపెనీలు అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి.