మూడు తరాలుగా ఆర్మీలోనే.. Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
మూడు తరాలుగా ఆర్మీలోనే..
దేశానికి సేవలందించిన ‘కంపిలి’ కుటుంబం
వీరోచిత పరాక్రమానికి గుర్తుగా వీరచక్ర పతకం
త్యాగధనుల కుటుంబం.. యువతకు ఆదర్శం

కర్నూలు(ఎడ్యుకేషన్‌), జనవరి 13: ఆ కుటుంబం మూడు తరాలుగా దేశ సేవలోనే తరిస్తోంది. ఎన్ని కష్టాలు ఎదురైనా బెదరలేదు. ఒకరి తర్వాత ఒకరు ఆర్మీలోకి వెళ్లారు ఆ కుటుంబ వారసులు. ప్రపంచంలోనే అత్యంత శీతలం, ఒళ్లును గడ్డకట్టించే ప్రమాదకరమైన ప్రదేశమైన సియాచిన్‌లోనూ ఈ కుటుంబ సభ్యులు విధులు నిర్వర్తించారు. శత్రు సైనికులకంటే వాతావరణమే ప్రధాన శత్రువుగా ఉన్న ఈ ప్రాంతాల్లో రాత్రనకా, పగలనకా దేశ సరిహద్దులను కాపాడారు. భూటాన్‌, జలంధర్‌, అస్సాం, గోహాటి, తేజఫూర్‌ వంటి ఉగ్రవాద ప్రాంతాల్లోనూ ప్రాణాలను పణంగా పెట్టి ఎదురొడ్డి పోరాడారు. దేశంలో స్వేచ్ఛగా, సంతోషంగా జీవిస్తున్నామన్నా, కంటినిండా నిద్రపోతున్నామన్నా అదంతా దేశ సరిహద్దుల్లో నిద్దురలేని రాత్రులతో పహారా కాసే సైనికుల త్యాగాలను అంతా స్మరించుకోవాలి.
 
స్వాతంత్ర్యానికి పూర్వమే సైన్యంలోకి..
స్వాతంత్ర్యానికి పూర్వం కర్నూలు జిల్లాలో ప్రకాశం జిల్లా ఉండేది. ఆనాటి ఒంగోలులోని అర్థవీడుకు చెందిన కంపిలి పెద్దవీరన్న స్వాతంత్య్రం రాకముందు ఆర్మీలో చేరారు. 1947లో జరిగిన రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కంపిలి పెద్దవీరన్న శత్రు సైన్యంతో పోరాడుతుండగా, శత్రువులు పేల్చిన మందుగుండుకు రెండు కాళ్లు తెగిపోయాయి. శస్త్ర చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన ఇంటికి చేరారు. అప్పట్లో కర్నూలు నుంచి కలెక్టర్‌ ఎద్దుల బండిపై అర్థవీడు వెళ్లి యుద్ధంలో గాయపడిన పెద్దవీరన్నకు ధైర్యం చెప్పారు. గ్రామంలో ఊరేగించి నగదు అవార్డు రూ. 5 వేలు, ఎకరా భూమిని కేటాయించారు. సైన్యం కూడా ఆయన సేవలను కొనియాడుతూ ‘వీరచక్ర’ పతాకం అందజేసింది. అయితే ఆయన అనారోగ్యంతో 1971 ఏప్రిల్‌ 26న కన్నుమూశారు.

దేశ సేవలో రెండో తరం
పెద్ద వీరన్న కుమారుడు కంపిలి వెంకటేశ్వర్లు కూడా తండ్రి స్ఫూర్తితో 1968లో ఇండియన్‌ ఆర్మీలో చేరారు. తండ్రి చనిపోయిన విషయం నెల వరకు వెంకటేశ్వర్లుకు తెలియదు. అప్పట్లో అత్యాధునిక సమాచార వ్యవస్థ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన టెలిగ్రామ్‌ కూడా అందలేదు. నెల తర్వాత తండ్రి చనిపోయారన్న విషయాన్ని తెలుసుకున్న వెంకటేశ్వర్లు డ్యూటీకి సెలవు పెట్టి సొంత గ్రామమైన అర్థవీడుకు వచ్చారు. అదే నెలలో వెంకటేశ్వర్లుకు మేనత్త కుమార్తె సుబ్బమ్మతో వివాహమైంది. తిరిగి విధుల్లోకి వెళ్లిన వెంకటేశ్వర్లు 1971లో జరిగిన చైనా-భారత యుద్ధంలో పాల్గొన్నారు. 1987లో పదవీ విరమణ పొంది స్వస్థలానికి చేరుకొని బ్యాంకు ఉద్యోగంలో మాజీ సైనికుల కోటా కింద చేరారు.
 
మూడో తరంలోనూ అదే స్ఫూర్తి
తాతతండ్రుల స్ఫూర్తితో ఆ కుటుంబంలో మూడో తరానికి వారసుడైన వెంకటేశ్వర్లు కుమారుడు వెంకటరమణ 1992లో బెంగుళూరులో జరిగిన ఇండియన్‌ ఆర్మీ ఎంపికల్లో పాల్గొని ఉద్యోగం సాధించారు. గుజరాత్‌, పటాన్‌, జమ్మూ-కాశ్మీర్‌, జలంధర్‌, పంజాబ్‌, అస్సాం, గోహాటి, తేజాపూర్‌ వంటి ప్రాంతాల్లో వెంకటరమణ విధులు నిర్వహించారు. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన (24 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకొని) పదవీ విరమణ పొందారు. ఈ కుటుంబంలో వెంకటరమణ ఆర్మీ ఉద్యోగంలో ఉండగానే ఆయన తమ్ముడు కె.రామకృష్ణయ్య కూడా ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యారు. సైనికుడిగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన విధులను నిర్వహిస్తున్నారు.
 
రెవెన్యూ అధికారులు మోసం చేశారు
 
మా నాన్న పెద్దవీరన్న రెండో ప్రపంచ యుద్ధంలో శత్రువులు పేల్చిన మందుగుండుతో రెండుకాళ్లూ పోగొట్టుకున్నారు. 1947లో అప్పటి కర్నూలు జిల్లా కలెక్టర్‌ నగదు అవార్డు రూ. 5 వేలతో పాటు ఎకరా భూమి కేటాయించారు. అయితే మా కుటుంబ సభ్యులంతా సైన్యంలో ఉండిపోవడంతో దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు స్థానిక నాయకులు, రెవెన్యూ శాఖ ఉద్యోగులు మాకు ప్రభుత్వం ఇచ్చిన విలువైన భూమిలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మించారు. మేము ఆలస్యంగా తెలుసుకొని రెవెన్యూ అధికారులను నిలదీయగా, విద్యుత్తు సబ్‌ స్టేషన్‌ పక్కనే భూమి ఇస్తున్నట్లు 75 సెంట్లకు పట్టా ఇచ్చారు. అయితే ఈ పట్టాలో ఉన్న సర్వే నెంబరు సబ్‌స్టేషన్‌ పక్కన ఉన్న భూమిది కాదు. అది ఎక్కడో ఊరికి దూరంగా వాగు ఒడ్డున ఉంది. ఆనాటి తహసీల్దార్‌ మాకు చేసిన అన్యాయాన్ని కలెక్టర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు, భారత రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశాం. అయినా మాకు న్యాయం జరగలేదు. చేసేది లేక చివరి ప్రయత్నంగా కోర్టును ఆశ్రయించాం. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఈ వ్యవహారం ఉంది.
మాజీ సైనికుడు కంపిలి వెంకటేశ్వర్లు,
రామకృష్ణనగర్‌, కర్నూలు


ఉద్యోగంలో ఉండే ఆనందమే వేరు:
 
సైనికుడిగా సేవలు అందించడంలో ఉన్న ఆనందం మరెందులోనూ ఉండదు. సెలవులో ఇంటికి వచ్చినప్పుడు భార్యాపిల్లలతో గడిపినప్పుడు మాత్రమే అక్కడి విషయాలను మరిచిపోతాం. సెలవు పూర్తయిన వెంటనే సైనిక స్థావరాలకు వెళ్లిన రెండు రోజుల వరకు భార్యా పిల్లలు గుర్తుకొస్తారు. తర్వాత అంతా సర్దుకొని మరిచిపోయి విధులపై దృష్టి పెడతాం. అంతా దేశసేవకే అంకితం అవుతాం. 24 సంవత్సరాల పాటు విధుల్లో తోటి సైనికులు అందించే స్ఫూర్తి ఒక సైనిక కుటుంబాన్ని చూసుకుంటున్నట్లు ఉంటుంది. నా సర్వీసులో ఏడు మెడల్స్‌ అందుకోవడం సంతోషంగా ఉంది.
మాజీ సైనికుడు కంపిలి వెంకటరమణ,
రామకృష్ణ నగర్‌, కర్నూలు
 
బతికినా ఆర్మీనే.. చచ్చినా ఆర్మీనే..
 
దేశ రక్షణకు సైన్యంలో ఉద్యోగం చేసినంత ఆనందం, సంతృప్తి మరే ఉద్యోగంలోనూ ఉండదు. నాకు 16 సంవత్సరాల్లోనే వివాహమైంది. చదువుసంధ్యా లేదు. భర్త, ఇద్దరు అబ్బాయిలు ఆర్మీలోనే పనిచేశారు. అర్థవీడులో ఉన్న కొద్ది పొలం పనులు చేసుకుంటూ, పిల్లల ఆలనా పాలనా చూసేదాన్ని. మిలటరీలో ఏదో ఒక చోట జరిగిన ఘటనలు చెబితే విని తొలుత భయపడేవాళ్లం. తర్వాత భయం పోయింది. అప్పట్లో మిలిటరీ వారికి తగినన్ని సెలవులు ఇచ్చేవారు కాదు. అలాగే మాట్లాడుకోవడానికి ల్యాండ్‌ ఫోన్లు అందుబాటులో ఉండేవికావు. యుద్ధం గురించి వార్తలు రేడియోలో మాత్రమే వినాల్సి వచ్చేది. నా భర్త ఇంటికి రాసే లేఖల ద్వారానే వారి క్షేమ సమాచారం తెలిసేది.
సుబమ్మ (మాజీ సైనికుడు వెంకటేశ్వర్లు భార్య)