హెచ్‌1-బి.. నిపుణులకు రాచబాటే Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
హెచ్‌1-బి.. నిపుణులకు రాచబాటే
అమెరికా... విద్య, ఉద్యోగావకాశాలకు పెట్టింది పేరు. ఏటా లక్షల సంఖ్యలో విదేశీ విద్యార్థులు డాలర్‌ డ్రీమ్స్‌తో అమెరికాలో అడుగుపెడుతుంటారు. విదేశీ విద్యార్థుల ద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు 35 బిలియన్‌ డాలర్లు సమకూరుతున్నాయి. అయితే పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీల మేరకు విద్య, ఉద్యోగ వీసాల విషయంలో నిబంధనలను కఠినతరం చేస్తోంది. ప్రస్తుతం హెచ్‌ 1బీ వీసా నియమాలను సవరించాలని భావిస్తోంది. దీనిపై అమెరికా ప్రభుత్వం స్పష్టత ఇచ్చినప్పటికీ ఇంకా కొంత గందరగోళం నెలకొనే ఉంది....
 
గతేడాది జనవరిలో డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విదేశీయుల రాక, వీసాల మంజూరు, స్వదేశీయులకు ఉద్యోగ కల్పనపై ఎన్నో అంశాలు నిత్యం వార్తల్లో ఉంటున్నాయి. ముఖ్యంగా అమెరికాలో పని చేస్తున్న విదేశీయులను నియంత్రించడం, అందుకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయడం వంటి ప్రతిపాదనలపై చర్చ జోరుగా సాగింది. అదే సమయంలో ‘కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌’ను ప్రత్యేక వృత్తి నిపుణుడిగా పరిగణించకపోవడం, హెచ్‌1బీ వీసాకు అర్హతలలో ఒకటైన ఐటీ ఉద్యోగులకు సగటు వార్షిక వేతనాన్ని పెంచడం వంటి చర్యలను తీసుకున్నారు.
 
హెచ్‌1బీకి డిమాండ్‌ ఎక్కువ
అమెరికాలో బహుళ వీసా విధానంలో అమల్లో ఉంది. ఒక్కో టాస్క్‌ను బట్టి ఒక్కో వీసాను కేటాయిస్తారు. అటువంటి వాటిలో ప్రధానమైౖంది హెచ్‌1బీ వీసా. అత్యధిక డిమాండ్‌ ఈ వీసాకే ఉంటుంది. ఎక్కువ నైపుణ్యం ఉన్న విదేశీయులను హెచ్‌1బీ వీసా ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన అమెరికా రప్పించడానికి 2000 సంవత్సరంలో అక్కడి కాంగ్రెస్‌ (ఉభయసభలు - సెనెట్‌, ప్రతినిధుల సభ) ‘అమెరికా కాంపిటీటివ్‌నెస్‌ ఇన్‌ ట్వెంటీఫస్ట్‌ సెంచరీ’ చట్టం చేసింది. ఆర్కిటెక్చర్‌, ఇంజనీరింగ్‌, మ్యాథమెటిక్స్‌, సైన్స్‌, మెడిసిన్‌, ఐటీ రంగాలకు చెందిన విదేశీ నిపుణులు అమెరికాలోని సంస్థల్లో పనిచేయడానికి ఆ దేశ ప్రభుత్వం జారీ చేసే తాత్కాలిక వర్క్‌ వీసా హెచ్‌1బీ. ఈ వీసాకి సంబంధించి దరఖాస్తు మొదలు పూర్తి బాధ్యతలను నియమించుకునే సంస్థలే తీసుకుంటాయి.
 
ఎన్నిసార్లయినా పొడిగింపు
అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) ఏటా 65 వేల మందికి మాత్రమే కంప్యూటర్‌ లాటరీ పద్థతిలో హెచ్‌1బీ వీసాలు మంజూరు చేస్తుంది. అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య పూర్తిచేసిన వారికి అదనంగా మరో 20 వేల హెచ్‌1బీ వీసాలు జారీ చేయొచ్చు. ప్రాథమికంగా మూడేళ్లకు వీసా మంజూరు చేస్తారు. తర్వాత మూడేళ్లు పొడిగించుకోవచ్చు.
హెచ్‌1బీ వీసా ఉన్నవారు అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్‌ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే.. ఆ దరఖాస్తు పరిశీలనలో ఉండగానే హెచ్‌1బీ వీసా గడువు ముగిసిపోయిన పక్షంలో గ్రీన్‌ కార్డుపై నిర్ణయం వెలువడే వరకు వీసా గడువును పొడిగిస్తారు. గ్రీన్‌ కార్డ్‌ కోసం చేసిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా హెచ్‌1బీ వీసాలను పొడిగించే అవకాశం ప్రస్తుత చట్టం కల్పించింది.
 
ఈ ప్రతిపాదన ఎందుకు?
ఈ విధానాన్ని కొనసాగించకూడదనీ, హెచ్‌1బీ వీసా కలిగిన వారు గ్రీన్‌ కార్డుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ... గ్రీన్‌ కార్డు మంజూరవడానికి ముందే వీసా గడువు పూర్తయితే అలాంటి వారిని స్వదేశాలకు పంపించేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ప్రతిపాదించారు. ఆ దేశ హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం కూడా ఈ విషయంలో సవరణలు సూచించిందనే వార్తలు కూడా వెలువడ్డాయి. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే గ్రీన్‌ కార్డు దరఖాస్తు పెండింగ్‌లో ఉండగానే వీసా గడువు ముగిసిన విదేశీ ఉద్యోగులు అమెరికా విడిచి స్వదేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. అలాంటి వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఆ కొలువులు అమెరికా జాతీయులకే దక్కుతాయనేది అమెరికా ప్రభుత్వ ఆలోచన. హెచ్‌1బీ వీసాతోపాటు ఎల్‌1 వీసా కార్యక్రమంపై సమీక్షిస్తానని, అవి దుర్వినియోగం కాకుండా నియంత్రిస్తానని ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో చెప్పారు.
 
సమీక్ష మాత్రమే
హెచ్‌1బీ వీసా గడువు పొడిగింపు ఉండదంటూ వచ్చిన వార్తలపై అమెరికా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అమెరికా ఉత్పత్తులనే కొనాలి - అమెరికన్లనే నియమించుకోవాలని అధ్యక్షుడు ట్రంప్‌ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వును అమలు చేయడానికి విధానపరమైన నిబంధనల్లో పలు మార్పులను అమెరికా పౌరసత్వ, వలసల ేసవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) పరిశీలిస్తోంది. ఉద్యోగ వీసాలను సమగ్రంగా సమీక్షించడం కూడా అందులోనే భాగమని యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది.
హెచ్‌1బీ వీసాల గడువును పొడిగించడానికి అవకాశం కల్పించే ‘అమెరికా కాంపిటీటివ్‌నెస్‌ ఇన్‌ ట్వెంటీఫస్ట్‌ సెంచరీ చట్టం (ఏసీ21)’ లోని సెక్షన్‌ 104సికి భాష్యం మార్చాలనుకోవడం లేదని యూఎస్‌సీఐఎస్‌ పేర్కొంది. సంబంధిత సెక్షన్‌ ప్రకారం.. హెచ్‌1బి వీసాలకు ఆరేళ్ల పరిమితికి మించి గడువును పెంచుకోవడానికి వీలవుతుంది. ఒక వేళ మార్పును తీసుకొచ్చినా హెచ్‌1బీ వీసాదారులు అమెరికాను వీడి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఏసీ21 చట్టంలోని 106 (ఎ) - (బి) కింద ఏడాదిపాటు గడువు పెంచాలని విజ్ఞప్తి చేసే అవకాశం ఉంటుంది.
 
15 లక్షల మంది భారతీయులపై ప్రభావం
హెచ్‌1బీ వీసా ద్వారా భారత ఐటీ కంపెనీలు అత్యధికంగా లబ్ధి పొందుతన్నాయి. ఏటా వేలాది సంఖ్యలో హెచ్‌1బీ వీసాలను సంపాదించి తమ కార్యకలాపాల నిర్వహణ కోసం ఉద్యోగులను అమెరికా పంపిస్తుంటాయి. ఒక అంచనా మేరకు జీవిత భాగస్వాములు, పిల్లలతో కలిపి మొత్తం 15 లక్షల మంది భారతీయులపై హెచ్‌1బీ వీసా ప్రభావం పడుతుంది. భవిష్యత్‌లో హెచ్‌1బీ వీసాకు సంబంధించి నియమాలను కఠినతరం చేస్తే వీరంతా స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
 
అమెరికాకే నష్టం: నాస్కామ్‌
హెచ్‌1బీ ప్రతిపాదనలపై ప్రస్తుతానికి యూఎస్‌సీఐఎస్‌ స్పష్టత ఇచ్చింది. ఒక వేళ ఇవి కార్యరూపం దాల్చితే అమెరికాకే ఎక్కువ నష్టమని భారతీయ ఐటీ కంపెనీల సమాఖ్య (నాస్కామ్‌) అభిప్రాయపడింది. కేవలం దేశీయ ఐటీ నిపుణులపై మాత్రమే కాకుండా అమెరికా పోటీతత్వంపై భారీగా ప్రభావం చూపనుందని తెలిపింది. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ (ఎస్‌టీఈఎం)లలో స్కిల్స్‌ ఉన్నవారు అమెరికాలో తక్కువగా ఉన్నారని, ఈ కారణంతోనే బహుళ జాతీయ కంపెనీలు వేలమంది ప్రతిభావంతులైన ఉద్యోగులను హెచ్‌-1బీ వీసాలపై అమెరికాకు తీసుకెళ్తున్నాయని నాస్కామ్‌ పేర్కొంది. టెక్‌ దిగ్గజాలు గూగుల్‌, ఐబీఎంలు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతాయి. ఈ కంపెనీల్లో విధులు నిర్వహించే చాలా మంది హెచ్‌1బీ వీసా ఉద్యోగులు. ఈ ప్రతిపాదనలను పలువురు అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులే కాకుండా యూఎస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (యూఎస్‌సీసీ) సైతం వ్యతిరేకించింది.