ఆఫ్‌బీట్‌ కోర్సులు...ఆసక్తికి పట్టం Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఆఫ్‌బీట్‌ కోర్సులు...ఆసక్తికి పట్టం
విదేశాల్లో స్థిరపడిన భారతీయుల గురించి చదవాలనే ఆసక్తి ఉందా? బుద్ధిజంలో మహాయానం ఏం చెబుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇలాంటి విభిన్న ఆసక్తులు ఉన్నవారికి తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రొఫెషనల్‌ కోర్సులపై మోజులో మరుగునపడిపోయిన విభిన్నమైన కోర్సులు సైన్స్‌, ఆర్ట్స్‌, ఇతర సబ్జెక్టుల్లో చాలా ఉన్నాయి. అభిరుచి ఉన్న విద్యార్థులు వీటిని ఎంచుకొని కెరీర్‌లో రాణించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని అనేక యూనివర్సిటీలు విభిన్న కోర్సులను అందిస్తున్నాయి. విద్యార్థుల ఆసక్తికి పెద్దపీట వేస్తూ యూనివర్సిటీలు ఈ కోర్సులను నిర్వహిసున్తాయి. డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌, పరిశోధన స్థాయుల్లో వీటిని ఎంచుకోవచ్చు. ఇలాంటి విభిన్న కోర్సుల గురించి తెలుసుకుందాం...
 
యోగా
ఆరోగ్యం విషయంలో అందరికీ అవగాహన పెరిగింది. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు ఆధునిక విధానాలతోపాటు సంప్రదాయ పద్ధతులను అవలంబిస్తున్నారు.
అటువంటి వాటిలో ప్రధానమైంది యోగా. కేవలం మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో యోగాకు మంచి ప్రాచుర్యం లభిస్తోంది. దీంతో ఐక్యరాజ్యసమితి ఏటా జూన్‌ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహిస్తుంది. యోగాకు ఉన్న ఆదరణ దృష్ట్యా ఇది కూడా ఒక కెరీర్‌గా ఆవిర్భవించింది. యోగాలో నిష్ణాతులకు హెల్త్‌ క్లబ్‌, జిమ్స్‌, యోగా స్టూడియో, పాఠశాలలు, కళాశాలల్లో విరివిరిగా అవకాశాలు ఉంటున్నాయి. అంతేకాకుండా యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా స్వయం ఉపాధి పొందొచ్చు. ఈ నేపథ్యంలో యోగాను ఒక కోర్సుగా కొన్ని విద్యా సంస్థలు ఆఫర్‌ చేస్తున్నాయి. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ పీజీ డిప్లొమా ఇన్‌ యోగా (పార్ట్‌టైం, అర్హత - డిగ్రీ), ఎంఏ యోగా (అర్హత - డిగ్రీ, యోగాలో బేసిక్‌ సర్టిఫికెట్‌), డిప్లొమా ఇన్‌ యోగా (అర్హత ఇంటర్మీడియెట్‌), సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ యోగా (అర్హత 10వ తరగతి) కోర్సులను ఆఫర్‌ చేస్తుంది.
వివరాలకు: www.andhrauniversity.edu.in/
 
ఎకనోమెట్రిక్స్‌
ఎకనోమెట్రిక్స్‌.. ఆర్థికశాస్త్రంలో ఒక విభాగం. వివిధ గణిత, సాంఖ్యక పద్ధతులను ఉపయోగించి ఆర్థిక రంగంలో భవిష్యత్‌ పరిణామాలను అంచనా వేయడానికి ఎకనోమెట్రిక్స్‌ తోడ్పడుతుంది. ఇందుకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించేందుకు ఎకనోమెట్రిక్స్‌ కోర్సులను ప్రారంభించారు. ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, ఫైనాన్షియల్‌ కంపెనీలు, ఇన్వెస్ట్‌మెంట్‌ ఏజెన్సీలలో ఎకనమిస్ట్‌, అనలిస్ట్‌, డెవలపర్స్‌, రీసెర్చ్‌ అనలిస్ట్‌ తదితర హోదాల్లో అవకాశాలు ఉంటాయి. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ ఎంఏ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా స్థాయుల్లో ఎకనోమెట్రిక్స్‌ కోర్సును ఆఫర్‌ చేస్తుంది.
వివరాలకు: www.svuniversity.edu.in

సెరికల్చర్‌
పట్టుపురుగుల పెంపకమే సెరికల్చర్‌. పట్టు పురుగుల పెంపకం, మన దేశంలో పట్టు పరిశ్రమకు ప్రత్యేక స్థానం ఉంది. తగిన పెట్టుబడి, శ్రమను జోడిస్తే పట్టు పురుగుల పెంపకం లాభదాయకంగా ఉంటుంది. ఈ కోణంలో ప్రభుత్వాలు కూడా పట్టు పరిశ్రమ స్థాపనకు పలు ప్రోత్సాహకాలను కల్పిస్తున్నాయి. ఈ అంశంపై శాస్త్రీయ అవగాహన కల్పించడంతోపాటు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించే ఉద్దేశంతో తిరుపతిలో శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాయలం ఎంఎస్సీ (సెరికల్చర్‌) కోర్సును ఆఫర్‌ చేస్తుంది. ఈ కోర్సులో సాయిల్‌ సైన్సెస్‌, మల్బరీ అగ్రానమీ, కాకూన్‌ ప్రొడక్షన్‌, ఫిజియాలజీ, సెరికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌, మేనేజ్‌మెంట్‌, మాలిక్యులర్‌ బయాలజీ, జెనెటిక్స్‌, బ్రీడింగ్‌, స్కిల్‌ ఫైబర్‌ తదితర అంశాలను బోధిస్తారు. 50 శాతం మార్కులతో బీఎస్సీ (సైన్స్‌ బ్రాంచ్‌) పూర్తి చేసిన వారు ఈ కోర్సులో చేరొచ్చు.
వివరాలకు: www.spmvv.ac.in/

వైరాలజీ
వైరస్‌ల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే వైరాలజీ. ఆధునిక వైద్య శాస్త్రంలో వైరాలజీకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అంటే వైరస్‌ల ద్వారా వ్యాపించే వ్యాధులు - లక్షణాలు, ఉత్పత్తి, వాటి జన్యు నిర్మాణం, వర్గీకరణ వంటి అంశాలను ఈ శాస్త్రంలో క్షుణ్నంగా తెలుసుకుంటారు. వైరాలజీ అనేది మైక్రోబయాలజీ / పాథాలజీలో భాగంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో ఇల్‌నెస్‌ నుంచి వెల్‌నెస్‌ దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. వివిధ వ్యాధులు, అందుకు కారణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందుకు అవసరమైన టీకాలు, ఔషధాలు వంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫార్మాస్యూటికల్‌, అగ్రికల్చర్‌, క్లినికల్‌ వంటి సంస్థల్లో నూతన డ్రగ్స్‌ ఉత్పత్తి కోసం నిత్యం పరిశోధనలు జరుగుతుంటాయి. కాబట్టి ఈ కోర్సును పూర్తి చేసిన వారికి ఆయా సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ ఎంఎస్సీ, పీహెచ్‌డీ స్థాయుల్లో వైరాలజీ కోర్సును ఆఫర్‌ చేస్తుంది.
వివరాలకు: www.svuniversity.edu.in
 
ఇండియన్‌ డయాస్పోరా
ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న భారతీయులపై అధ్యయనం చేయడానికి 1996లో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ ఇండియన్‌ డయాస్పోరాను ప్రారంభించారు. భారతదేశం నుంచి వలస వెళ్లిన వారి చారిత్రక నేపథ్యం, నాగరికత, సంస్కృతి, ఆర్థికంగా, రాజకీయంగా చోటు చేసుకున్న మార్పులు తదితర అంశాలను శాస్త్రీయంగా తెలుసుకోవడానికి ఈ సెంటర్‌ కృషిచేస్తుంది. ఈ క్రమంలో ఆయా అంశాలపై అవగాహన కల్పించడానికి ఎంఏ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ స్థాయుల్లో ఇంటర్‌ డిసిప్లీనరీ కోర్సులను ఆఫర్‌ చేస్తుంది. వలస వెళ్లిన తరవాత గుర్తింపు, స్థిర పడిన విధానం, వారి జీవితాల్లో వచ్చిన మార్పులు, చేసిన పోరాటాలు, భారత్‌తో సంబంధాలు - వివిధ రంగాల్లో చేసిన సేవలు, ఈ విషయంపై వచ్చిన రచనలు వంటి అంశాలు ఆయా కోర్సుల్లో అంతర్భాగంగా ఉంటాయి.
వివరాలకు: www.uohyd.ac.in

మహాయాన బుద్ధిస్ట్‌ స్టడీస్‌
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 1982లో మహాయాన బుద్ధిస్ట్‌ స్టడీస్‌ శాఖను ప్రారంభించారు. ఈ శాఖ అధ్వర్యంలో ఎంఏ (మహాయాన బుద్ధిస్ట్‌ స్టడీస్‌) కోర్సును అందిస్తున్నారు. ఇందులో బౌద్ధమతం చరిత్ర, ఆ మత భావనలు, విలువలు, దేశంలో స్మారక కట్టడాలు, కళలు, ఆంధ్రప్రదేశ్‌లో బౌద్ధమతం, ఆగ్నేయాసియా దేశాల్లో బౌద్ధమతం, సమకాలీన ప్రపంచం - మతాలు - బౌద్ధమతం వంటి అంశాలను బోధిస్తారు.
వివరాలకు: www.nagarjunauniversity.ac.in/
 
టూరిజం మేనేజ్‌మెంట్‌
ప్రస్తుతం పర్యాటక రంగానికి ప్రాధాన్యం పెరిగింది. రాష్ట్రాలన్నీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రమోషన్‌ కార్యక్రమాలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్‌ కోసం సినిమా తారలను, క్రీడాకారులను అంబాసిడర్స్‌గా కూడా నియమించుకుంటున్నాయి. దాంతో దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఫలితంగా సంబంధిత రంగంలో వేలాది అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటక రంగంలో ఎటువంటి ఉద్యోగాలు ఉంటాయి, వాటికి ఎలా సిద్ధం కావాలి, ఎలాంటి నైపుణ్యాలను పెంచుకోవాలి అనే విషయంలో అవగాహన కల్పించడానికి టూరిజం మేనేజ్‌మెంట్‌ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి టూరిజం సంస్థలు, హోటల్స్‌, ట్రావెల్‌ కన్సల్టెన్సీ తరహా సంస్థల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాయం అండర్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో బీఏ (టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌తోపాటు హిస్టరీ, పబ్లిక్‌ అడ్మినిస్ర్టేషన్‌, తదితరాలు ఐచ్ఛికాలుగా), పీజీలో మాస్టర్‌ ఆఫ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌ (ఎంటీఎం) కోర్సులను ఆఫర్‌ చేస్తుంది. పీజీ కోర్సులో రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వివరాలకు: http://kuwarangal.net/
 
ఇండ స్ట్రియల్‌ మైక్రోబయాలజీ
సూక్ష్మజీవులను పారిశ్రామికంగా ఉపయోగించే విధానాలు ఇండస్ర్టియల్‌ మైక్రోబయాలజీలో ఉంటాయి. అంటే సూక్ష్మజీవులను వినియోగించి వివిధ ఉత్పత్తులను తయారు చేస్తారు. ఔషధాలు, రసాయనాలు, ఇంధనాలు తదితర పరిశ్రమల్లో ఈ తరహా విధానాన్ని అనుసరిస్తారు. హెల్త్‌ ప్రొడక్ట్స్‌, ఫుడ్‌, బేవరేజెస్‌, వ్యాక్సిన్‌, అగ్రికల్చర్‌, కెమికల్‌, ఆయిల్‌, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సంస్థల్లో విరివిరిగా అవకాశాలు ఉంటాయి. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ ఎంఎస్సీ - ఇండస్ర్టియల్‌ మైక్రోబయాలజీ కోర్సును ఆఫర్‌ చేస్తుంది.
వివరాలకు: www.svuniversity.edu.in
 
జానపద కళలు
బోధన, పరిశోధన, ప్రచురణ వంటి కార్యక్రమాల ద్వారా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, చరిత్రను పరిరక్షించడం, అభివృద్ధి చేయడం వంటి లక్ష్యాలతో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఈ విశ్వవిద్యాలయం జానపద కళలకు సంబంధించి ఎంపీఏ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్‌ స్థాయుల్లో కోర్సులను ఆఫర్‌ చేస్తుంది. ఇందులో జానపద సంగీతం, బుర్రకథ, జనపద వాద్యం, ఇంద్రజాలం విభాగాలు ఉన్నాయి. రంగస్థలం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పకళ, సంగీతం, జ్యోతిషం, వాస్తు, జర్నలిజం, ట్రావెల్‌ అండ్‌ టూరిజం, ఫిల్మ్‌ డైరెక్షన్‌ తదితర కోర్సులను కూడా అందిస్తుంది.
వివరాలకు: http://teluguuniversity.ac.in/
 
ఆస్ర్టానమీ
ఖగోళ సంబంధ దృగ్విషయాలను అధ్యయనం చేసే శాస్త్రమే ఆస్ర్టానమీ. ఇందులో ఖగోళ వస్తువులు అంటే నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు, చంద్రుడు, గ్రహ శకలాలు వంటి వాటి ఆవిర్భావం, ఉనికి, పరిణామం, పరిశోధనలు తదితర అంశాలు అంతర్భాగంగా ఉంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఎంఎస్సీ ఆస్ర్టానమీ కోర్సును ఆఫర్‌ చేస్తుంది. ఈ కోర్సులో చేరాలంటే డిగ్రీలో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌ చదివి ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. రాత పరీక్షలో ఫిజిక్స్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
వివరాలకు: www.osmania.ac.in/
 
అప్లయిడ్‌ లింగ్విస్టిక్స్‌
లింగ్విస్టిక్స్‌ (భాషా శాస్త్రం)లోని ఒక ఉప విభాగం అప్లయిడ్‌ లింగ్విస్టిక్స్‌ (అనువర్తిత భాషా శాస్త్రం). నిజ జీవితంలో భాషకు సంబంధించి ఎదురయ్యే వివిధ సమస్యలకు పరిష్కార మార్గాలను అప్లయిడ్‌ లింగ్విస్టిక్స్‌ సూచిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ - సెంటర్‌ ఫర్‌ అప్లయిడ్‌ లింగ్విస్టిక్స్‌ అండ్‌ ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌ ఎంఏ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ స్థాయుల్లో అప్లయిడ్‌ లింగ్విస్టిక్స్‌ కోర్సును ఆఫర్‌ చేస్తుంది. రాత పరీక్ష ఆధారంగా ఇందులో ప్రవేశం కల్పిస్తారు. అదేవిధంగా ఐదేళ్ల ఎంఏ (లాంగ్వేజ్‌ సైన్స్‌) ఇంటిగ్రేటెడ్‌ కోర్సును కూడా అందిస్తుంది.
వివరాలకు: www.uohyd.ac.in