ఆ సవాల్‌కు ఇదే నా సమాధానం! Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఆ సవాల్‌కు ఇదే నా సమాధానం!
పిల్లల్ని చూసుకోవడానికి వీలుపడట్లేదు. పని వేళలు మార్చమని తను పనిచేస్తున్న సంస్థను కోరిందీమె. అది కుదరని పని అన్నారు వాళ్లు. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసేసింది. అలాగని కెరీర్‌ కోల్పోయానని బాధపడుతూ కూర్చోలేదు. పనిచేయాలనే తపనతో ‘బ్రిడ్జింగ్‌ కెరీర్‌’ అనే హెచ్‌ఆర్‌ కన్సల్టెన్సీ సంస్థను ఏర్పాటుచేసింది. దాన్నే తన కెరీర్‌కి బ్రిడ్జిగా వేసుకున్న రూపాసింగ్‌ మరికొందరికి ఉపాధి కల్పిస్తోంది. భవిష్యత్తులో పాతిక కంపెనీలను క్లయింట్లుగా చేసుకోవాలనేదే లక్ష్యం అంటున్న ఆమె మాటల్లోనే మరిన్ని వివరాలు...
 
‘‘మొదటి అబ్బాయి పుట్టాక ఒక పక్క ఉద్యోగం చేస్తూనే వాడ్ని, కుటుంబ బాధ్యతల్ని చూసుకుంటుండేదాన్ని. కానీ పాప పుట్టాక మాత్రం అలా చేయలేకపోయాను. ఫ్యామిలీ సపోర్టు ఉన్నప్పటికీ... ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగం చేయడం కష్టమై పోయింది. ఆఫీసులో ఉన్నంత సేపూ పిల్లల మీదే ధ్యాస. నా షిఫ్ట్‌ టైమింగ్స్‌ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు. ఈ టైమింగ్‌ వల్ల పిల్లల్ని ఉదయం, సాయంత్రం రెండు పూటలా చూసుకోవడం కష్టమైపోయింది. దాంతో పనివేళల్లో మార్పు చేస్తారేమో అని అడిగాను. అలాకానీ మారిస్తే ఉద్యోగంలో కొనసాగొచ్చు అనుకున్నా. ఆ సంస్థ వాళ్లేమో అది వీలుపడదన్నారు. ఇక మరో ప్రత్యామ్నాయం లేకపోయింది. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేశాను.
కుదురుగా నిలవనీయలేదు
రాజీనామా అయితే చేశాను కాని చదువు పూర్తయిన దగ్గర్నించీ ఉద్యోగం చేసిన నాకు పనివేళల్లో వెసులుబాటు ఉండే పనేదైనా చేస్తే బాగుండు అనిపించేది. అదికూడా ఇంటి నుండి చేసేదైతే కెరీర్‌కి ఫుల్‌స్టాప్‌ పడదు. పిల్లల్నీ జాగ్రత్తగా చూసుకోవచ్చు అనే ఆలోచన నన్ను కుదురుగా నిలవనీయలేదు. సరిగ్గా అప్పుడే నేను చదివిన ఎంబిఎ ఫైనాన్స్‌ చదువు, ఉద్యోగానుభవాలు కలిసి ‘మేమున్నాం’ అంటూ నాకు దన్నుగా నిలబడ్డాయి. అలా బ్రిడ్జింగ్‌ కెరీర్‌ అనే హెచ్‌ ఆర్‌ కన్సల్టెన్సీ సంస్థ ప్రయాణం 2011లో ప్రారంభమైంది. ఒక్క క్లయింట్‌ (సంస్థ)తో మొదలైన మా ప్రయాణంలో ఇప్పుడు 15 మంది క్లయింట్‌లు చేరారు. ఐటి, నాన్‌ ఐటి, మానుఫాక్చరింగ్‌, బిపిఓ (బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌ సోర్సింగ్‌), కెపిఓ (నాలెడ్జి ప్రాసెస్‌ అవుట్‌ సోర్సింగ్‌), మార్కెట్‌ రీసెర్చి, సప్లయ్‌ రంగాల్లో జూనియర్‌, మిడిల్‌, సీనియర్‌ లెవల్స్‌లో రిక్రూట్‌మెంట్స్‌ సర్వీసులు అందిస్తున్నాం. డొమెస్టిక్‌ రిక్రూట్‌మెంట్‌ మాత్రమే చేస్తున్నప్పటికీ... మన దేశంలోని సంస్థలకు యుకె, చైనా, టాంజానియా, దక్షిణాఫ్రికాలలో యూనిట్లు ఉన్నప్పుడు అక్కడికి కూడా రిక్రూట్‌మెంట్‌ ఇస్తున్నాం.
 
మాది చిన్నసైజ్‌ సంస్థే... కాని మా దగ్గర ఉద్యోగుల్ని తీసుకోవడంలో కొన్ని గట్టి నియమం పెట్టుకున్నా. మా కంపెనీ సికింద్రాబాద్‌లోని ఇసిఐఎల్‌ వైపు ఉంది. అందుకని మా ప్రాంతానికి సమీపంలో ఉన్న వాళ్లని, అదికూడా పిల్లలున్న ఆడవాళ్లనే తీసుకుని, వాళ్లకి తగిన సమయాల్లోనే పనిచేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నా. ఎందుకంటే పిల్లల్ని చూసుకునేందుకు పనివేళల్లో మార్పు కుదరక నేను ఉద్యోగాన్ని మానేయాల్సి వచ్చింది. మరి నేను ఎదుర్కొన్నలాంటి ఇబ్బందే నా దగ్గర పనిచేసే ఆడవాళ్లకి ఎదురుకాకూడదు కదా. ప్రస్తుతానికి మా సంస్థలో ముగ్గురు ఆడవాళ్లు ఉన్నారు. ఈ సంఖ్యను భవిష్యత్‌లో కనీసం పది మంది మహిళా ఉద్యోగినులకు చేర్చాలి. అలాగే క్లయింట్ల సంఖ్య 25కు చేర్చాలి.
 
మళ్లీ ఉద్యోగం చేయాలనుకున్నా
వ్యాపారం కోసం ఈ రంగమే ఎందుకు ఎన్నుకున్నావని మీరు అడగొచ్చు. భారీ పెట్టుబడి పెట్టి మానుఫాక్చరింగ్‌ బిజినెస్‌ స్టార్ట్‌ చేయడం నాకు వీలుపడదు కాబట్టి ఈ రంగంవైపు దృష్టిపెట్టాను. నా ఉద్యోగానుభవం కంపెనీలకు ఎలాంటి ప్రొఫైల్స్‌ అవసరం అవుతాయో నేర్పింది. అలాగే ఉద్యోగార్థులు ఎలాంటి కంపెనీలు కోరుకుంటారో తెలుసు. జీతభత్యాలు, పోటీదారులు ఎవరు, ఎటువంటి నైపుణ్యాలు ఉన్న వాళ్లు కావాలి వంటి విషయాల పట్ల సమగ్రమైన సమాచారం ఉంది నా వద్ద. అదీకాక హెచ్‌ఆర్‌ రంగం అయితే పెట్టుబడి అక్కర్లేదు. ఇక్కడ మీ అనుభవమే మీ పెట్టుబడి. అదెలాగూ నా దగ్గర ఉంది. అందుకని ఈ సంస్థకు అంకురార్పణ చేశా. సంస్థ ప్రారంభించిన కొత్తలో ఉద్యోగం చేస్తే నెలజీతం ఎంత వస్తుందో అంతకంటే కొంచెం ఎక్కువ సంపాదిస్తే చాలనుకున్నా. ఒకవేళ అలాకాని రాకపోతే రెండుమూడేళ్ల తరువాత తిరిగి ఉద్యోగం వెతుక్కోవాలనుకున్నా. మొదట్లో కష్టంగానే ఉండేది. ఎందుకంటే మాది కొత్త కన్సల్టెన్సీ. కొత్తవాటిని నమ్మి రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ ఇవ్వవు కంపెనీలు. అదీకాక మార్కెటింగ్‌ ఏమీ చేసుకోకుండా నేరుగా మార్కెట్‌లోకి అడుగుపెట్టాను. అది కాస్త ఇబ్బంది అయ్యింది. కానీ అప్పటికే నాకున్న పరిచయాలను ఆసరాగా చేసుకుని క్లయింట్‌లను మా సంస్థ వైపు తిప్పుకోగలిగా. దానికి తోడు మా సర్వీసుని తీసుకున్న క్లయింట్‌లే మమ్మల్ని వేరే వాళ్లకి రికమండ్‌ చేయసాగారు. అలా నెమ్మది నెమ్మదిగా విస్తరిస్తూ ఏడేళ్లుగా స్థిరంగా సంస్థను నడపగలుగుతున్నా.
 
... ఆ తృప్తి ఉద్యోగంలో ఉండదు!
ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా ఒత్తిడి ఉండడం సహజమే. అయితే ఈ రెండు ఒత్తిళ్లలో వ్యత్యాసం ఉంటుంది. ఉద్యోగంలో ఎంత పని చేసినా ఆత్మసంతృప్తి దొరకదు. అదే సొంతంగా మనమే ఒక కంపెనీ నడుపుకుంటే లభించే తృప్తి, కలిగే ఆనందం వేరుగా ఉంటాయి. అది ఎవరికి వాళ్లు ఆస్వాదిస్తేనే తెలుస్తుంది. నా ఈ ప్రయాణంలో నేనో విషయాన్ని నేర్చుకున్నా. అది వ్యాపారానికే కాదు జీవితానికీ చాలా బాగా పనికొస్తుంది. అదేంటంటే - ‘మనుషులే ముఖ్యం’. ఈ విషయం తెలియకముందు కంపెనీ సైజ్‌ పెద్దదయితే చాలు నడుస్తుందనుకునేదాన్ని. కాని సొంతంగా సంస్థ నడపడం మొదలుపెట్టాక ‘పీపుల్‌ రన్‌ ద కంపెనీ’ అని తెలిసింది. ఈ సూత్రాన్ని మా సంస్థకు ఆపాదించి చెప్పాలంటే... మా క్లయింట్‌ కంపెనీ సైజ్‌ పెద్దదా, చిన్నదా అనేది ముఖ్యం కాదు. వాళ్లకి కావాల్సిన అభ్యర్ధులను అందిస్తున్నామా?లేదా? అది చూసుకోవాలంతే. క్లయింట్‌ అవసరం బట్టి ఉద్యోగార్థితో మాట్లాడి పంపిస్తుంటాం. సమస్య ఎక్కడొస్తుందంటే... ఇంటర్వ్యూలు అవుతాయి. జీతభత్యాలు మాట్లాడుకుంటారు. అంతా ఓకే అవుతుంది. అయితే ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థి ఉద్యోగంలో చేరితేనే మాకు డబ్బు వస్తుంది. కానీ కొన్నిసార్లు ఆ అభ్యర్థి ఉద్యోగంలో చేరరు. దాంతో మాకు రావాల్సిన డబ్బు రాదు. ఇటువంటివి ఎదురైనప్పుడు మనసులో గుబులుగా అనిపిస్తుంది. ఈ పనిచేయగలనా ఇక మీదట అనే అనుమానమూ కలుగుతుంది. రాత్రిళ్లు నిద్రకూడా సరిగా పట్టదు. అలాగని టైం అక్కడే ఆగిపోదు కదా... మరుసటిరోజు ఉదయం యథావిధిగా పనిలోకి వెళ్లగానే రిక్వైర్‌మెంట్స్‌ కావాలనే ఇ-మెయిల్‌ కనిపిస్తుంది. దాంతో కొత్త ఉత్సాహం వస్తుంది. మళ్లీ పని మొదలు. అదీకాక సొంతంగా మనకంటూ ఒక పని చేసుకోవడం మొదలుపెట్టాక వెనక్కి వెళ్లి ఉద్యోగం చేయడం కూడా కష్టమే. ఈ రెండింటితో పాటు నన్ను ముందుకు నడిపించే డ్రైవింగ్‌ ఫోర్స్‌ పన్నెండో తరగతి చదువుతున్న మా అబ్బాయి, నాలుగో తరగతి చదువుతున్న మా అమ్మాయి.
 
ట్రెండ్స్‌ గమనిస్తూ ముందుకెళ్తున్నాం
అయితే ఒక్క విషయం మహిళలుగా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ముందు మనల్ని మనం తక్కువ చేసుకోవడం మానేయాలి. అలాగే అమ్మాయిలు పెళ్లి ఒకటే లక్ష్యంగా ఉండకూడదు. మీకు మీరే లక్ష్యం కావాలి. మీ ఆరోగ్యం గురించి పట్టించుకోవాలి. వ్యక్తిగతంగా ఎదగాలి. అందరికీ ఉద్యోగమో, వ్యాపారమో చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఏదో ఒక అభిరుచి వృద్ధి చేసుకోవాలి. ఏదో ఒక పని చేస్తుండాలి. అలాగైతేనే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. నన్నే తీసుకుంటే వ్యాపారంలోకి అడుగుపెట్టే వరకు ఏ రోజూ కూడా ఈ రంగంలోకి వస్తానని అనుకోలేదు. ఉద్యోగం చేసే పరిస్థితులు లేకపోవడం వల్ల ఇటువైపు వచ్చాను. నాకొచ్చిన ఆలోచనను మా ఆయనతో చెప్తే ఓకే అన్నారు. ఆ తరువాత ఇందులోనే డబ్బులు వస్తున్నప్పుడు కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగం చేయడం ఎందుకనుకున్నాం ఇద్దరం. దాంతో ఆయన కూడా నాతో కలిసి పనిచేస్తున్నారు. తను మార్కెటింగ్‌ వ్యవహారాలు చూసుకుంటారు. దాంతోపాటు అర్ధరాత్రి వచ్చే క్లయింట్స్‌ కాల్స్‌ కూడా అటెండ్‌ అవుతుంటారు. నా ఒక్క బుర్ర ఆలోచించే బదులు.. మా రెండు బుర్రలు ఆలోచించడం వల్ల ఫలితం బాగుంటుంది కదా. ఇద్దరం కలిసి మార్కెట్‌ ట్రెండ్స్‌ గమనిస్తూ ముందుకెళ్తున్నాం. ప్రస్తుతానికి ఎన్నుకున్న రంగంలో హ్యాపీగా ఉన్నా. అన్నీ కుదిరితే ఇంకా విస్తరించే ఆలోచన ఉంది’’ అంటున్నారామె.
 
మాకు ఢోకా లేదు
గత ఏడాది కంటే ఈ ఏడాది జాబ్‌ మార్కెట్‌ కొంచెం బెటర్‌గానే ఉంది. కొత్తగా ఉద్యోగాలు లేవు కానీ రీప్లేస్ మెంట్‌ పొజిషన్‌లు ఉంటున్నాయి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వచ్చే మార్పులు జాబ్‌ మార్కెట్‌ మీద ప్రభావం చూపెడతాయి. ఆ ప్రభావం వల్ల కంపెనీలు ముందు ట్రైనింగ్‌కి చెక్‌ పెడతాయి. తరువాత రిక్రూట్‌మెంట్స్‌ కట్‌ చేస్తాయి. అది మా మీద నెగెటివ్‌ ఎఫెక్ట్‌ను చూపెడుతుంది. అయినప్పటికీ మాకున్న పాజిటివ్‌ పాయింట్‌ ఏంటంటే కంపెనీలు ఉన్నంత కాలం ఉద్యోగాలు ఉండడం. ఉద్యోగులు కూడా మూడునాలుగేళ్లు పనిచేశాక కారణాలు ఏవైనా గానీ వేరే కంపెనీకి మారాలనుకుంటుంటారు. వాళ్లలా వెళ్లగానే ఆ ఖాళీ హైరింగ్‌కి సిద్ధం. ఈ ప్రాసెస్‌ జరిగినంత కాలం మాకు ఢోకా లేదు.
 
కిరణ్మయి, ఫోటోలు: ఎం.ఎస్.ఆర్‌. వర్మ