బ్యాండ్ బాజా బ్యాచ్ Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
బ్యాండ్ బాజా బ్యాచ్
‘కుర్రాళ్లోయ్‌.. కుర్రాళ్లూ.. వెర్రెక్కి ఉన్నోళ్లు..’ ఇంత ఊపున్న పాట పాడుతుంటే ఎవరు మాత్రం ఊగిపోరు. ఈ పాటను అంతే ఉల్లాసంగా ప్రజెంట్‌ చేసిన ఆ కుర్రాళ్లు ఎంత వెర్రెక్కి ఉన్నోళ్లంటే... పాట కోసం ఉద్యోగాలు వదులుకున్నారు. ఓ పూట సాపాటు లేకున్నా.. ఒక పాటెత్తుకుంటే చాలు బ్రదర్‌ అనుకునే రకాలు. అందుకే ఆ నలుగురు స్థాపించిన ‘క్యాప్రిష్యో’ బ్యాండ్‌ అంటే ఇప్పుడు భాగ్యనగరంలో ఫుల్‌ ఫేమస్‌. బాలీవుడ్‌, హాలీవుడ్‌ పాటలకే పట్టం కడుతున్న బ్యాండ్స్‌ సంస్కృతిలో తెలుగు గమకాలు వినిపిస్తున్న ఆ కుర్రాళ్ల ప్రస్థానం ఇది...
 
పాటల్లోనే కాదు.. ఆహార్యంలోనూ మాకో ప్రత్యేకత ఉంది. కొన్ని వేదికలపై యోయో స్టయిల్‌లో కనిపిస్తాం. ఇంకొన్ని సార్లు పంచెకట్టుతో కనికట్టు చేస్తాం. మన యువత తెలుగులో మాట్లాడడానికే నామోషీగా భావిస్తోంది. అలాంటి వారి ఆలోచనలు మార్చాలని, మాతృభాషకు గౌరవం ఇవ్వాలని తెలుగు పాటలు ఎక్కువగా పాడుతున్నాం. పబ్బుల్లో, కాఫీషాపుల్లో కెవ్వు కేక పుట్టిస్తున్న ఈ బ్యాండ్‌కు సోషల్‌ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది.
 
హైదరాబాద్‌లోని ఒక ఇంజనీరింగ్‌ కాలేజ్‌!
అక్కడ భారీ ఈవెంట్‌ జరుగుతోంది. ఆ నోటా ఈ నోటా ‘క్యాప్రిష్యో’ బ్యాండ్‌ దంచేస్తోందని విన్నారు ఈవెంట్‌ ఆర్గనైజర్లు. అందుకే తమ కాలేజీ మెగా ఈవెంట్‌లో చిల్లవుట్‌ చేయడానికి ‘క్యాప్రిష్యో’ కుర్రాళ్లకు అవకాశం ఇచ్చారు.ఈవెంట్‌ మహారంజుగా సాగుతోంది.‘నెక్ట్స్‌ వెల్‌కమ్‌ ‘క్యాప్రిష్యో’ బ్యాండ్‌ బ్లాస్టర్స్‌..’ అని ఉల్లాసంగా ప్రకటించాడు అనౌన్సర్‌! ఆ నలుగురు రాక్‌స్టార్స్‌ ఏ రేంజ్‌లో ఉంటారో అనుకుని.. కాలేజీ కుర్రకారు ఈలలు, కేకలతో స్వాగతం పలుకుతున్నారు.
 
 
కాసేపటికే.. కాలేజ్‌ గ్రౌండంతా నిశ్శబ్దం ఆవరించింది. వేదికపైకి వింతగా చూడటం మొదలుపెట్టారు. ఇదేంటి ఇలా ఉన్నారని చెవులు కొరుక్కుంటున్నారు. వారు అంతలా విస్తుపోవడానికి కారణం.. ఈ నలుగురు బ్యాండ్‌ స్టార్లు.. పంచెకట్టులో వేదికపై ప్రత్యక్షం కావడమే! అసలే బ్యాండ్‌, అందునా ఇంజనీరింగ్‌ కాలేజీలో పెర్ఫార్మెన్సు.. ఏ రేంజులో ఊహించుకుంటారో చెప్పలేం. టాటూలు, చెవులకు రింగులు, చిరిగిపోయిన ప్యాంట్లు, చెదిరిపోయిన జుట్లు.. ఇలా వస్తారనుకుంటే.. ‘రాముడు మంచి బాలుడు’ అన్న టైపులో సంప్రదాయ వస్త్రాల్లో వీళ్లొచ్చారు. వారి ఆహార్యాన్ని చూసి తేరుకునేలోపే.. సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహ్మాన్‌ పాట ఒకటి అందుకున్నారు. పల్లవి పూర్తయిందో లేదో.. కాలేజ్‌ గ్రౌండ్‌ అంతా ఊగిపోయింది. చప్పట్లతో మార్మోగిపోయింది. ఆ పాటను మాషప్స్‌ టచ్‌ ఇచ్చేసరికి.. బాక్సులు బద్దలయ్యాయి. ప్రోగ్రామ్‌ అయిపోయే వరకూ ఆ నలుగురి పాటలు ఆగలేదు.. విద్యార్థుల నృత్యాలూ ఆగలేదు. అదీ ‘క్యాప్రిష్యో’ కుర్రాళ్లంటే!
 
ఒకరికి ఒకరు
ఈ నలుగురిలో ఇద్దరి పేర్లు గణేశ్‌, కిరణ్‌. ఇద్దరూ మంచి పాటగాళ్లు. ‘పాడుతా తీయగా’ వంటి కార్యక్రమాల్లో ప్రతిభ చాటినవాళ్లు. శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉంది. సినిమా సంగీతంపై పట్టుంది. అందుకే సంగీతాన్ని సీరియ్‌సగా తీసుకున్నారు. ఒక బ్యాండ్‌ పెట్టాలని భావించారు. బ్యాండ్‌లో తమకు చేదోడుగా ఉండే చేయి కోసం వెతకడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో వారికి డ్రమ్మర్‌ సాయి తేజ తగిలాడు. తేజ ‘విప్రో’ సంస్థలో ఆరు నెలలు ఉద్యోగం చేశాడు. సంగీతం విషయంలో రాజీ పడలేక ఉద్యోగానికి రాజీనామా చేశాడు. పెర్క్యూషన్స్‌ అతడికి మంచి పట్టుంది. ఎంత అంటే.. ఇరవై పెర్క్యూషన్స్‌ ప్లే చేసి.. ఏకంగా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌నే కొల్లగొట్టాడు. ఇద్దరు సింగర్స్‌, ఒక డ్రమ్మర్‌ ఇంత వరకూ బాగానే ఉంది. కీ బోర్డు ప్లేయర్‌ ఒక్కరు దొరికితే.. బ్యాండ్‌ బజాయించొచ్చు అనుకున్నారు. ముగ్గురూ కలిసి అన్వేషణ మొదలుపెట్టారు. తెలిసిన వాళ్లను వాకబు చేశారు. ఫేస్‌బుక్‌లో పేజీలకు పేజీలు వెతికారు. అప్పుడే దొరికాడు వరంగల్‌కి చెందిన శ్రవణ్‌. కీ బోర్డును ఎడాపెడా వాయించగల సమర్థుడు. నలుగురూ ఒక్కటయ్యారు. ఒకరికి ఒకరు అనుకున్నారు. అందరూ ట్వంటీ ప్లస్‌ కుర్రాళ్లు. అందరిలోనూ ఏదో ఒకటి సాధించాలన్న తపన! పైగా మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా, ఎ.ఆర్‌.రెహ్మాన్‌లకు వీర ఫ్యాన్‌లు. అభిరుచులు, ఆశయాలు అన్నీ కలవడంతో ‘బ్యాండ్‌’ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు.
 
షరతులతో ఓకే..
ఆవేశంలో పిల్లలు ఎన్నో అనుకుంటారు. అందులోనూ పాటల పల్లకీలో ఊరేగుతామంటున్నారు. వీళ్ల పెద్దవారి ఆలోచన మరోలా ఉంది. ‘ఉద్యోగం చేస్తే బాగుంటుంది.. క్లారిటీ లేని ఫీల్డ్‌లో ఎన్నాళ్లని కష్టపడతారు’ అని అన్నారు. పెద్దలను బతిమాలారు. నచ్చజెప్పారు. చివరికి వారికి వారే కండిషన్స్‌ విధించుకున్నారు. ఒక్క సంవత్సరం సమయం అడిగారు. ఏడాదిలోగా ఈ ఫీల్డ్‌లో నిలదొక్కుకోకపోతే.. ఉద్యోగాలు చేస్తామని మాటిచ్చారు. తల్లితండ్రులు ఓకే అన్నారు. అలా అన్నారో లేదో ఇలా ‘క్యాప్రిష్యో’ బ్యాండ్‌ మొదలైంది. ‘క్యాప్రిష్యో అనేది ఇది ఇటాలియన్‌ పదం. అంటే లైవ్‌ ఫామ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ (ప్రత్యక్ష సంగీత ప్రదర్శన)’ అని వివరించారు ఆ నలుగురు.
 
బ్యాండ్‌ బ్రాండ్‌
బ్యాండ్‌ని మొదలుపెట్టారు. అవకాశాలు రాలేదు. నెల రోజులు గడిచాయో లేదో.. ‘ఇవన్నెందుకులే గానీ, ఇక ఉద్యోగాలు చేసుకోండి’ అని ఇరుగు పొరుగు సూటిపోటి మాటలు మొదలయ్యాయి. ‘పాటలంటూ రోడ్లెంట తిరిగితే.. కనీసం పిల్లనివ్వరు’ అని కొందరు ఎగతాళి చేశారు. ‘మేం చాలా కష్టపడ్డాం. చాలా చోట్లకు తిరిగాం. ఒక్క అవకాశమూ రాలేదు. అయినా మాలో కసి తగ్గలేదు. మమ్మల్ని మేము ఫేస్‌బుక్‌ ద్వారా ప్రమోట్‌ చేసుకున్నాం. అలా యువతకి దగ్గరయ్యాం. దీంతో అవకాశాలు వచ్చాయి. ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్నాం. మెల్లగా మా బ్యాండ్‌కు ఒక బ్రాండ్‌ ఏర్పడింద’ని గుర్తు చేసుకున్నారీ కుర్రాళ్లు.
 
పంచెకట్టు.. కనికట్టు..
పాటల్లోనే కాదు.. ఆహార్యంలోనూ వీరికి ఒక ప్రత్యేకత ఉంది. కొన్ని వేదికలపై యోయో స్టయిల్‌లో కనిపిస్తారు. ఇంకొన్ని వేదికలపై పంచెకట్టుతో కనికట్టు చేస్తారు. వీరిని అలా చూడగానే అందరూ సర్‌ప్రైజ్‌ అవుతారు. ‘‘రెహ్మాన్‌ పాటలు ఎక్కువగా పాడతాం. ఇక ఇళయరాజాగారి పాటలు ఉండాల్సిందే! ఎక్కువగా తెలుగు పాటలే ఆలపిస్తాం. కాలేజీలు, కాఫీ షాప్‌లు, కార్పొరేట్‌ షోలు, చివరికి పబ్స్‌లో కూడా తెలుగు పాటలు ఎత్తుకుంటాం. ముంబైలో హిందీ పాటలు, పంజాబ్‌లో పంజాబీ పాటలు, తమిళనాడులో తమిళ పాటలు బ్యాండ్స్‌లో పాడతారు. మన దగ్గరికి వచ్చేసరికి చాలా బ్యాండ్స్‌ హిందీ పాటలే ఎక్కువగా పాడతాయి. తెలుగులో అద్భుతమైన పాటలున్నాయి. పైగా మన యువత తెలుగులో మాట్లాడటానికే నామోషీగా భావిస్తోంది. అలాంటి వారి ఆలోచనలు మార్చాలని, మాతృభాషకు గౌరవం ఇవ్వాలని తెలుగు పాటలు ఎక్కువగా పాడుతున్నాం. మా బ్యాండ్‌ ప్రత్యేకత కూడా ఇదే’’ అంటారు వీళ్లు.
 
అనూహ్య స్పందన..
ఫిల్మ్‌నగర్‌లోని మూన్‌షైన్‌ ప్రాజెక్ట్‌ ప్లేస్‌లో ప్రతి శనివారం కేవలం తెలుగు పాటలే పాడతారు. అలాగని ‘క్యాప్రిష్యో’ తెలుగు పాటలకే పరిమితం కాదు. అందమైన బాలీవుడ్‌ పాటలు ఆలపిస్తారు. దుమ్మురేపే హాలీవుడ్‌ నెంబర్స్‌ కూడా పాడేస్తారు. ‘బ్యాండ్‌ కల్చర్‌లో తెలుగు పాటలు ఎవరు వింటారని అన్నవాళ్లూ ఉన్నారు. కొందరైతే ‘మాకు ఫలానా పాట కావాల’ని అడిగి మరీ పాడించుకుంటారు. ఇటీవల శిల్పకళావేదికలో మా షో పూర్తయిన తర్వాత అరవయ్యేళ్ల పెద్దావిడ వచ్చి మా నలుగురితో సెల్ఫీ దిగి వెళ్లింది. తెలుగు అర్థం కాని ఒక వ్యక్తి.. మా షోకు వచ్చి.. ‘మీ పాటలు బాగున్నాయ’ని చీటీలో రాసి పంపారు. ఇంతకన్నా ఏం కావాల’ని సంతోషంగా చెప్పుకొచ్చారు క్యాప్రిష్యో కుర్రాళ్లు.
 
అదే మా కల..
వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం వీళ్లెవరూ పాకులాడరు. ఏ పేరొచ్చినా అదంతా ‘బ్యాండ్‌’దే. సంగీతంతో సాగిపోవడం అంటే మాకిష్టం అంటారు వీళ్లు. మేం సొంతంగా కంపోజ్‌ చేసుకున్న స్వరాలతో భవిష్యత్తులో ఆల్బమ్స్‌ చేయాలి. ‘మా బ్యాండ్‌ పేరు చెబితే చాలు.. మమ్మల్ని గుర్తించాలి. అదే మా ఆశయం. మా అభిమాన సంగీత దర్శకుడు రెహ్మాన్‌ ముందు ప్రదర్శనివ్వాలన్నది మా జీవిత కల’ అని ముగించారు. వీరి ఆశయాలు, కలలు నెరవేరాలని మనమూ కోరుకుందాం.
 
గణేశ్‌
మా అమ్మ మ్యూజిక్‌ టీచర్‌. నాకు సంగీతంలో ఓనమాలు నేర్పింది కూడా అమ్మే. మాది హైదరాబాద్‌. నాలుగేళ్ల వయసు నుంచీ పాడుతున్నా. క్లాసికల్‌ సంగీతం డి.రాఘవాచారి గారి దగ్గర నేర్చుకున్నా. పలు టీవీ షోల్లో పాల్గొన్నాను. కర్ణాటక సంగీతం కోర్సు చేశాను. బీటెక్‌ చదివాను. అన్ని రకాల పాటలూ పాడతాను. మెలోడి అంటే చాలా ఇష్టం.
 
కిరణ్‌
మాది హైదరాబాద్‌. మా అమ్మ తరఫు వాళ్లలో మంచి సంగీత కళాకారులున్నారు. ఇక మా అత్తయ్య వయోలిన్‌ కళాకారిణి. ఆరో తరగతి నుంచే నేను పాటలు పాడేవాణ్ణి. హరిహరన్‌, పాకిస్థాన్‌ ఫోక్‌ స్టూడియోలో ఉండే అలినూర్‌ నాకు ఇష్టమైన గాయకులు.
 
సాయితేజ
అమ్మమ్మ, తాతయ్య దగ్గరి నుంచీ సంగీత వారసత్వం కొనసాగుతోంది. మా నాన్న బి.వి. రమణమూర్తి హైదరాబాద్‌లో పేరున్న డ్రమ్మర్‌. మా అమ్మ సితార వాద్యం ప్లే చేస్తారు. మా చెల్లెలు పదమూడు వాద్యాలు ప్లే చేస్తుంది. మాకు ‘కళ్యాణి అకాడమీ’ అనే సంగీత అకాడమీ ఉంది. నాన్నతో కలిసి చిన్నప్పట్నుంచి సంగీత కార్యక్రమాలకు వెళ్లేవాణ్ణి. అలా డ్రమ్స్‌ వాయించడం నేర్చుకున్నా. ఉస్తాద్‌ షబ్బీర్‌ నిషార్‌ గారి దగ్గర తబలా నేర్చుకున్నా. డ్రమ్స్‌, తబలా మిగతా చిన్న చిన్న వాద్యాలు అన్నీ కలిపి 20 వరకూ ప్లే చేయగలను. 2015లో మా చెల్లెలు 13, నేను 17.. ఇలా 30 ఇన్‌స్ట్రుమెంట్స్‌ను 50 నిమిషాల్లో ప్లే చేసి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరు సాధించాం. తబలాలో ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌, డ్రమ్స్‌లో గణేశ్‌ రామనాథన్‌ నాకు స్ఫూర్తి.
 
శ్రవణ్‌
నేను పాలిటెక్నిక్‌ చదివాను. నాలుగేళ్ల వయసు నుంచీ కీ బోర్డు ప్లేయర్‌. మా సొంతూరు వరంగల్‌. అయితే హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉండే ట్రినిటీ కాలేజ్‌ లండన్‌లో మ్యూజిక్‌ కోర్సు చేశాను. మా నాన్న ఆరోగ్యశాఖలో పని చేస్తారు. నేను ఏది చేస్తానన్నా నాన్న ఓకే అనేవారు. కీ బోర్డు ఇష్టం అంటే కీ బోర్డు కొనిచ్చారు. నన్నెంతో ప్రోత్సహించారు. సంగీత దర్శకుడు కావాలనే ఆశయంతో ఈ రంగంలోకి వచ్చాను.
- రాళ్లపల్లి రాజావలి