మల్లవరపు బాలలత... సివిల్స్ టాపర్ ఇంటర్వ్యూ Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
మల్లవరపు బాలలత... సివిల్స్ టాపర్ ఇంటర్వ్యూ
శిఖరప్రాయమైన సివిల్స్‌లో ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికలో ఇంటర్వ్యూ కీలకమైనది. అభ్యర్థి బహుముఖ ప్రజ్ఞాపాఠవాలను, వ్యక్తిత్వాన్ని పరీక్షించేందుకు ఇంటర్వ్యూను ఉద్దేశించారు. సివిల్స్‌ సీనియర్‌ అధికారులకు తోడు ఆయా రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులు ఈ ఇంటర్వ్యూలో పాలుపంచుకుంటారు. అభ్యర్థి నేపథ్యం, హాబీలు తదితరాలను దృష్టిలో పెట్టుకొని ప్రశ్నిస్తారు. అభ్యర్థులు చెప్పే జవాబులను బట్టి అత్యంత ప్రాధాన్యం కలిగిన సివిల్‌ సర్వీసులకు వారు ఎంతవరకు అర్హులో నిగ్గుతేలుస్తారు. ఇంటర్వ్యూల తీరూతెన్ను తెలుసుకొనేందుకు ఉపకరిస్తాయన్న అభిప్రాయంతో 167వ ర్యాంకు సాధించిన మల్లవరపు బాలలత ఇంటర్వ్యూలను ప్రచురిస్తున్నాం.

నా ఇంటర్వ్యూ ఏప్రిల్‌ 19న మధ్యాహ్నం జరిగింది. అరవింద్‌ సక్సేనా బోర్డు ఇంటర్వ్యూ చేసింది. ఆ బోర్డులో నేను మూడో అభ్యర్థిని.
 
బోర్డ్‌ చైర్మన్‌:
ప్ర: 2005లో ఇండియన్‌ డిఫెన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ సర్వీస్‌ సాధించి మళ్లీ ఇన్ని సంవత్సరాల తరవాత ఎందుకు పరీక్ష రాశారు?
జ: జీవితంలో విజయం సాధించడానికి తమ బలహీనతలు పెద్ద అవరోధాలని భావించే మహిళలకు, దివ్యాంగులకు స్ఫూర్తినివ్వడానికి, పట్టుదల ఉంటే విజయం సాధించడం అసాధ్యం కాదని నిరూపించడానికి నేను మళ్లీ సివిల్స్‌ పరీక్ష రాశాను.
 
ప్ర: ప్రస్తుతం మీరు ఏ పదవిలో ఉన్నారు. ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు?
జ: ప్రస్తుతం నేను డిప్యుటేషన్‌పై డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌లో డెట్‌ రికవరీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాను. బకాయిల వసూళ్ల విషయంలో నాకు క్వాసీ జ్యుడిషియల్‌ అధికారాలు ఉంటాయి. వాటిని ఉపయోగిస్తూ, ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న సమస్యల్లో అతిక్లిష్టమైన నిరర్ధక ఆస్తులను పునరుద్ధరించే బాధ్యలను నిర్వహిస్తున్నాను.
 
ప్ర: అరబ్‌ స్ర్పింగ్‌ అంటే ఏమిటి? దాన్ని విస్తరించడంలో అమెరికా ముఖ్య పాత్ర పోషించిందని నేనంటాను?
జ: ట్యునీషియాలో నెలకొన్న అరాచక పాలనను వ్యతిరేకిస్తూ అక్కడి యువత ప్రభుత్వ వ్యతిరేక పోరాటానికి తెర తీశారు. ఆపై ఇది లిబియా, ఈజిప్ట్‌, యెమెన్‌, సిరియా, ఇరాక్‌ దేశాలకు విస్తరించింది. అయితే ఇందులో నేషనల్‌ ఎండోమెంట్‌ ఫర్‌ డెమోక్రసీ అనే సంస్థ ద్వారా ఆ పోరాటాలకు ఆర్థిక సాయం అందటం వాస్తవం. కానీ, స్థానిక పౌరుల పోరాట పటిమ, మార్పు కోసం వారు పడే ఆరాటం... ఇవి లేకుండా ఏ పోరాటం కూడా పూర్తిగా విదేశీ సహాయ సహకారాలపై ఆధారపడలేదు.
 
ప్ర: డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా ఫస్ట్‌ పాలసీపై మీ అభిప్రాయం?
జ: జాతీయతాభావం కలిగి ఉండటం, తమ సొంత దేశ ప్రయోజనాల కోసం కఠిన చర్యలు తీసుకోవడం నాయకులకున్న స్వేచ్ఛ. కానీ, ఒక దేశంలో అనేక జాతులు, మతాల ప్రజలు ఉంటారు. ప్రజల మధ్య వైషమ్యాలు, విధ్వేషాలు పెరిగేరీతిలో తమ పాలసీని ఆవిష్కరించడం సరికాదు. ఆది మానవీయతకు భంగం కలిగిస్తుంది.
 
ప్ర: ఆంధ్ర ప్రదేశ్‌ విభజన గురించి చెప్పండి?
జ: చారిత్రక, సామాజిక, సాంస్కృతిక నేపథ్యం ఉన్న రెండు తెలుగు రాష్ర్టాల ఆర్థిక పరిస్థితులు, అక్కడ లభ్యమయ్యే సహజ వనరులు, నదీజలాలు వంటి అంశాలను ఒక్కొక్కటిగా వివరించాను. విభజన ప్రక్రియలోని లోటుపాట్లను, శ్లాఘనీయమైన అంశాలను, ప్రత్యామ్నాయాలను ప్రస్తావించాను.
 
ప్ర: లా చదివారు కదా.. ఉచిత న్యాయ సేవల పరిస్థితి మనదేశంలో ఎలా ఉంది?
జ: ఆర్టికల్‌ 39(ఎ)ని అనుసరిస్తూ, భారత ప్రభుత్వం నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ యాక్ట్‌ను ప్రవేశపెట్టింది. భారత అత్యున్నత న్యాయస్థానం కూడా ఉచిత న్యాయసేవలు ప్రాథమిక హక్కుగా పరిగణించాలని సూచించింది. నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఉచిత న్యాయ సేవల గురించి ప్రాచుర్యం కల్పించే ప్రయత్నాలను చేపడుతోంది. కానీ, ఆ ప్రచారం ఇప్పటికీ మారుమూల ప్రాంతాలకు చేరలేదనే చెప్పాలి. మన దేశంలో నిరక్షరాస్యత మాత్రమే సమస్య కాదు. న్యాయ నిరక్షరాస్యత కూడా పెద్ద సమస్యే. ప్రభుత్వాలు లిటరసీ, కంప్యూటర్‌ లిటరసీ, ఫైనాన్షియల్‌ అలాగే లీగల్‌ లిటరసీ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
రెండో మెంబర్‌:
ప్ర: బికాన్‌ లైట్స్‌ తీసివేతను మీరు సమర్థిస్తారా?
జ: కచ్చితంగా సమర్థిస్తాను. మనదేశంలో విఐపి సంస్కృతిని రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ప్రజాస్వామ్యంలో సామాన్యుడి కంటే ఎవ్వరూ ఎక్కువ కారు. అయితే ఇది రాజ్యాంగ పీఠికకో లేక నోటి మాటగానో పరిమితం కాక ఆచరణాత్మకంగా రుజువు చేసేదే ఈ ప్రభుత్వ చర్య.
 
ప్ర: మానవ సంకల్పం ముఖ్యమా సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యమా?
జ: మానవ సంకల్పం, అంతఃకరణశుద్ధి ముఖ్యం. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగించుకోవడం లేదా దుర్వినియోగపరచడం అనేది మానవుడి చేతిలో ఉంటుంది. అలాంటప్పుడు మానవ సంకల్పమే ముఖ్యం కదా. కానీ, పరిపాలనలో పారదర్శకతను పెంచడానికి వీలైనంత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడం చాలా అవసరం.
 
మూడో మెంబర్‌:
ప్ర: ఈమధ్య కాలంలో సుప్రీంకోర్టు జ్యుడీషియల్‌ యాక్టివిజమ్‌ ప్రదర్శించిన కొన్ని సంఘటనలు తెలుపగలరా?
జ: ప్రైవేటు బాడీ అయిన బిసిసిఐని సంస్కరించే ప్రయత్నం, ఎ361కు వ్యతిరేకంగా అరుణాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌కు కోర్టుకు హాజరు కావల్సిందిగా ఆదేశాలు జారీచేయడం, గవర్నమెంటును బ్యాడ్‌లోన్స్‌ ప్యానల్‌ను స్థాపించాల్సిందిగా ఆదేశించడం, నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ ఉండగానే కరువు సమస్యల పరిష్కారానికై మరోమారు నేషనల్‌ డిజాస్టర్‌ మిటిగేషన్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయమనడం, కేవలం నీట్‌ పరీక్ష ద్వారానే వైద్యవిద్యలో ప్రవేశార్హత కల్పించాలని చెప్పడం.
 
ప్ర: ప్రైవేటు సంస్థ బిసిసిఐ విషయంలో జ్యుడీషియరీ ప్రమేయం సరైనదేనా?
జ: ఆర్టికల్‌ 12 పరిధిలోకి బిసిసిఐ రాదు. రాజ్యాంగపరంగా బిసిసిఐని స్టేట్‌గా గుర్తించలేమని ఇదివరకు సుప్రీంకోర్టు బిసిసిఐ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో చెప్పింది. అయినప్పటికీ క్రికెట్‌ జాతీయస్థాయిలో ఎందరో అభిమానులను సంపాదించుకుంది. క్రీడాస్ఫూర్తిని నింపుతోంది. అంతకంటే ముఖ్యంగా బిసిసిఐ ఆర్థికంగానూ ఎంతగానో లాభపడుతోంది. భారత క్రికెట్‌ జట్టుకు సంబంధించిన అంశాలేవీ జాతీయం చేయకపోయినా జాతీయతకు అద్దంపట్టే బిసిసిఐ, పారదర్శకంగా విధులు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా జరగని పక్షంలో జ్యుడీషియరీ ప్రమేయం సరైనదేనని నేను భావిస్తున్నాను.
 
ప్ర: తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా సాధ్యపడతాయా?
జ: ఇదివరకే తమిళనాడులో సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని మించి 69 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఇది తమిళనాడు రిజర్వేషన్లు కల్పించడానికి చేసిన చట్టాన్ని రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్‌లో ఉంచడం వల్ల ఇది సాధ్యపడింది. సుప్రీంకోర్టు ఐఆర్‌ కోహెలో కేసులో చెప్పిన విఽధంగా తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చిన చట్టాల విషయంలో కూడా జ్యుడీషియరీ ప్రమేయం వీలవుతుంది. కానీ, తెలంగాణ ప్రభుత్వం స్థానికంగా ముస్లింల దీనస్థితిని న్యాయస్థానంలో ధృవీకరించాల్సి ఉంటుంది.
 
ప్ర: ఇండియా-చైనా అంతర్జాతీయ సంబంధాల్లో అతి త్వరగా మెరుగుపడాల్సిన అంశం ఏమిటి?
జ: అంతర్జాతీయ సంబంధాల్లో త్వరితగతిన దేనినీ మెరుగుపర్చడం కుదరకపోవచ్చు. ఎందుకంటే చాలా అంశాలు అంతర్జాతీయ స్థాయిలోనే కాక స్థానిక విషయాలతో కూడా ముడిపడిఉంటాయి. ఉదాహరణకు చైనా, పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ లాంటి సున్నితమైన అంశంలో అంత వేగం సరికాదు. కానీ, రెండు దేశాల మధ్య సంబంధాలు ఆ దేశ ప్రజల మధ్య ఉన్న పరస్పర అనుబంధంపై, విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. దానిని మనం సాఫ్ట్‌ పవర్‌ అంటున్నాం. అయితే 2014లో బిబిసి వరల్డ్‌ సర్వీస్‌ పోల్‌లో కేవలం 33 శాతం భారతీయులు చైనీయులపై, 27 శాతం మంది చైనీయులు భారతీయులపై సదాభిప్రాయం కలిగి ఉన్నారని వెల్లడైంది. ఇది చాలా విచారించదగిన విషయం. ఈ పరిస్థితి మెరుగుపడటానికి రెండు ప్రభుత్వాలు కృషిచేయాలి.
 
నాలుగో మెంబర్‌:
ప్ర: బేసిన్‌ స్ట్రక్చర్‌ థియరీ కేసు గురించి చెప్పగలరా?
జ: మొదటి ఒకటో రాజ్యాంగ సవరణ ద్వారా ఎ31-ఎ, ఎ31-బిని రాజ్యాంగంలో చేర్చారు. రాజ్యాంగంలోని పార్ట్‌-3లోని ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుందంటూ శంకరీ ప్రసాద్‌ కేసులో వాదించారు. కానీ, సుప్రీంకోర్టు పార్లమెంటుకు ఎ368 ప్రకారం పార్ట్‌-3లోని ప్రాథమిక హక్కులను కూడా సవరించే అధికారం ఉందని చెప్పిన తరవాత సజ్జన్‌సింగ్‌ కేసులోనూ అదే అభిప్రాయాన్ని అంగీకరించింది న్యాయస్థానం. కానీ, గోలక్‌నాథ్‌ కేసులో పార్ట్‌-3ని సవరించే హక్కు పార్లమెంటుకు లేదని తీర్పు చెప్పింది. ఆ తరవాత కేశవానంద భారతి కేసులో పార్లమెంటు పార్ట్‌-3లోని ప్రధాన హక్కులను సవరించవచ్చు కానీ, రాజ్యాంగ బేసిక్‌ స్ట్రక్చర్‌ మాత్రం మార్చడానికి వీలులేదని పేర్కొంది. కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళనే మనం బేసిక్‌ స్ట్రక్చర్‌ అంటున్నాం. అయితే బేసిక్‌ స్ట్రక్చర్‌ను రాజ్యాంగంలో వివరించలేదు. ఈ థియరీ ద్వారా ప్రాథమిక హక్కుల పరిధిని న్యాయస్థానాలు చాలావరకు విస్తరింపచేశాయి.
 
ప్ర: మేనకాగాంధీ కేసు వ్యక్తిగత స్వేచ్ఛను ఎలా మెరుగుపరిచింది?
జ: మొదట ఎ.కె.గోపాలన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మద్రాసు కేసులో ఎ21కు చాలా నేరో ఇంట్రప్రటేషన్‌ ఇచ్చింది. చట్టాన్ని ‘లా’ పుస్తకాల్లో ఎలా రాసుకుంటే అలాగే అమలు చేయాలన్నది సుప్రీంకోర్టు. (ప్రొసీజర్‌ ఎస్టాబ్లి్‌షడ్‌ బై లా). కానీ మేనకాగాంధీ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ప్రొసీజర్‌ ఎస్టాబ్లి్‌షడ్‌ బై లా అన్నది అమెరికన్‌ రాజ్యాంగంలోనే డ్యూ ప్రాసెస్‌ ఆఫ్‌ లా వంటిదేనని, చట్టాన్ని కేవలం లిటరల్‌ ఇంట్రప్రటేషన్‌కు పరిమితం చేయరాదని, స్వేచ్ఛను, న్యాయాన్ని, సమానత్వాన్ని కాపాడేవిధంగా విశదీకరించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఎ21 పరిధిని పెంచడంలో, తద్వారా వ్యక్తిగత స్వేచ్ఛను జీవితహక్కుకు సమానంగా చూడటంలో ఈ కేసు ప్రధాన భూమిక పోషించింది.
 
ప్ర: డిఫైన్‌ హ్యాపీనెస్‌: ఆనందం అంటే ఏమిటో వివరించండి?
జ: ఆనందం అనేది వస్తువులోనో లేక సంపదలోనో ఉండదు. అది మనిషి తనస్థాయి, శక్తియుక్తులతో సంబంధం లేకుండా అంతర్లీనంగా అనుభవించగలిగే ఒక అనుభూతి. మహాత్మాగాంధీ మాటల్లో చెప్పాలంటే మనం బుద్ధితో ఆలోచించేది, మనం వాక్కు ద్వారా పలికేది, అలాగే మనం ఆచరణాత్మకంగా చేసేది ఒక్కటే అయినప్పుడు అసలైన ఆనందం కలుగుతుంది.