ఈ టీచరమ్మ బంగారం Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఈ టీచరమ్మ బంగారం
మంచి పనికి మనసుండాలే కానీ.. డబ్బులు ఉండనక్కర్లేదు. తమిళనాడులోని ఓ మారుమూల గ్రామంలోని సర్కారు టీచరమ్మ అన్నపూర్ణ.. నగలను తాకట్టుపెట్టి.. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్‌ స్కూల్‌లా ఆకర్షణీయంగా మార్చారు. ఆ పిల్లలకు ఇంగ్లీషు మాట్లాడేలా తర్ఫీదునిచ్చారు. ఇలాంటి బంగారు టీచరమ్మ.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పడుతున్న కష్టం చూస్తుంటే.. అభినందించక తప్పదు! అందుకే తమిళ టీచర్‌ అన్నపూర్ణను ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది..
 
ఏ స్త్రీకి అయినా పుత్తడి ఆరోప్రాణం!
కానీ, ఈ టీచరమ్మకు బడి పిల్లలు తొలి ప్రాణం!!
 
తక్కెడలో తూచినట్లు.. నీకు బంగారం ఎక్కువా? బడి పిల్లలు ఎక్కువా? అనడిగితే - వీసమెత్తు తేడాలేకుండా.. ‘‘పిల్లలే ఇష్టం! ఎందుకంటే వాళ్లకు మంచి భవిష్యత్తును ఇస్తే.. బంగారం కంటే విలువైన పౌరులుగా ఎదుగుతారు. జాతికి విలువైన సంపద అవుతారు’’ అనంటారీమె. లేకపోతే, తన అపురూపమైన నగలును తాకట్టు పెట్టి.. బడి రూపురేఖలు మార్చగలిగేవారా? చెప్పండి. ఈ రోజుల్లో సర్కారు టీచరు అనగానే.. సంఘంలో ఏర్పడిన ఒక దురభిప్రాయాన్ని తుడిచేసిందీ తమిళనాడుకు చెందిన ఉపాధ్యాయురాలు అన్నపూర్ణ. పక్కన ఫోటోలో కనిపిస్తున్న ఆ పాఠశాలను చూస్తే మీకే తెలుస్తుంది.
 
పల్లెస్కూలు పంట పండింది..
రంగు వెలిసిపోయిన బ్లాక్‌బోర్డు. అరిగిపోయిన చాక్‌పీసులు. కుంటి బల్లలు, పాత కుర్చీలు. ఇక, మంచినీళ్లు, మరుగుదొడ్లు.. ప్రభుత్వ బడుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అందుకే- నిపుణులైన ఉపాధ్యాయులు ఉన్నా సరే.. వసతులలేమితో సర్కారుస్కూళ్ల వైపు మధ్యతరగతి కన్నెత్తి చూడటం లేదు. ఈ ధోరణి మారాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా.. తరగతిగదిలోని టీచరే ముందుకొస్తే.. ఒక చిన్న త్యాగం చేయగలిగితే.. ఆ పనే చేసింది తమిళనాడు టీచరు అన్నపూర్ణ.
ఆమె పనిచేస్తున్న స్కూలు తమిళనాడులోని విల్లుపురం అనే పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలోని ‘కందాడు’ పంచాయతీ పరిధిలో ఉందా స్కూలు. ఐదో తరగతి వరకు చదువుకునే సదుపాయం ఉందక్కడ. నూటా యాభైమంది పిల్లలు ఉన్నారు. ‘‘ఆ స్కూల్‌లో నేను మూడోతరగతి పిల్లలకు చదువు చెబుతుంటాను. నా క్లాస్‌లో పాతిక మంది పిల్లలున్నారు. వాళ్లను మెరికల్లా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం..’’ అన్నారు టీచర్‌ అన్నపూర్ణ. కార్పొరేట్‌ స్కూళ్ల మాదిరి అత్యాధునిక వసతులు, సదుపాయాలు లేవు. అడిగితే ప్రభుత్వం ఇవ్వదు. నిధులు మంజూరు చేస్తే అన్ని స్కూళ్లకు చెయ్యాలి. అదెప్పుడూ అయ్యే పని కాదు.
 
నాన్న ‘రెండ్రూపాయల’ డాక్టర్‌..
అన్నపూర్ణ మధ్యతరగతి టీచరు. పుట్టింది దిండివనంలో. అమ్మ అనురాధ.. పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్లు. తండ్రి మోహన్‌ వైద్యుడు. ‘‘నాకు ఆయనే స్ఫూర్తి. నాన్న ఇప్పుడు లేరు. కానీ, బతికున్నంత కాలం పేషెంట్ల దగ్గర కేవలం రెండంటే రెండ్రూపాయలే ఫీజు తీసుకునేవారు. దాదాపు జీవితమంతా ఉచితవైద్య సేవ అన్నమాట. నాన్నలోని సామాజికస్పృహ నాకు అలవడిందేమో..’’ అన్నారీ టీచర్‌. తండ్రి డాక్టర్‌ అయినప్పటికీ ఉపాధ్యాయవృత్తినే ఎంచుకుందీమె. ‘‘మొదట్లో నెలకు కనీసం లక్ష సంపాదించాలన్న లక్ష్యం ఉండేది.
ఎందుకో మళ్లీ ఉపాధ్యాయ వృత్తి వైపు మనసు మళ్లింది. గ్రాడ్యుయేషన్‌ అయ్యాక బీఈడీ చేశా. ఎంబీఏ, ఎమ్‌ఎస్సీ మ్యాథ్స్‌, ఎంఏ ఆంగ్లం చదివాను..’’ అని గుర్తుచేసుకున్నారామె. సహజంగా డాక్టర్‌ కూతురు డాక్టర్‌ అవుతుంది. కానీ అన్నపూర్ణ తండ్రిలోని సేవాదృక్పథం వల్ల డాక్టర్‌ కాలేక టీచర్‌ అయ్యింది. అయితే, అందరు టీచర్లలాగ వృత్తిని ఆషామాషీగా తీసుకోలేదు.
 
నగల్ని తాకట్టు పెట్టి..
జీతం వస్తే తప్ప నడవదు అన్నపూర్ణ కుటుంబం. వెనకాముందూ ఆస్తిపాస్తులేమీ లేవు. కుటుంబ బరువు బాధ్యతలు చాలానే ఉన్నాయి. అలాంటిది ఒక రోజు - స్కూలు బాగు కోసం త్యాగపూరిత నిర్ణయం తీసుకున్నారు అన్నపూర్ణ. చేతిలో డబ్బు లేకపోతేనేం? ‘‘నా దగ్గరున్న బంగారు నగల్ని తాకట్టు పెట్టయినా సరే.. బడి స్వరూపాన్ని మార్చేయాలి’’ అన్నది ఆమె ఆలోచన. ‘‘ఆలోచన వచ్చిన వెంటనే తాకట్టు పెడతానని అమ్మకు చెబితే ‘మీ నాన్న బుద్ధి వచ్చింది. చెబితే వింటావా.. నీ ఇష్టం’ అన్నది. నా బంగారు నగల్ని తీసుకుని వ్యాపారి వద్దకు వెళ్లాను. తాకట్టుపెట్టి లక్షా అరవై వేల రూపాయలు తీసుకున్నాను. నెల నెలా వడ్డీ తప్పనిసరిగా చెల్లించాలన్నది ఒప్పందం. మొదటి నెల వడ్డీ పట్టుకుని ఇచ్చారు. నెలయ్యింది కదా వడ్డీ చెల్లించాలి.. (నవ్వులు) ’’ అన్నారు అన్నపూర్ణ.
 
ఇంగ్లీష్లో గలగలా..
తాకట్టుపెట్టి తెచ్చిన డబ్బులతో స్కూలును సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారీ ఉపాధ్యాయురాలు. ‘‘ప్రపంచంతో కనెక్ట్‌ కావాలంటే ఇంగ్లీషు తప్పనిసరి. ఈ భాషలో పల్లెల్లోని పిల్లలు చాలా పూర్‌. కానీ, వసతులు, సరికొత్త బోధనా పరికరాలు సమకూర్చాక ఊహించని మార్పు వచ్చింది. కార్పొరేట్‌ స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా.. ఏర్పాటు చేశాను. దీంతో మా పిల్లల్లో ఆత్మవిశ్వాసం వచ్చింది. ఇంగ్లీషు సులభంగా నేర్చుకున్నాను. కాన్ఫిడెంట్‌గా మాట్లాడేస్తున్నారు. ఇదంతా కొన్ని నెలల్లోనే జరిగింది’’ అంటూ గుర్తు చేసుకున్నారీ తమిళటీచర్‌. ఆమె ఇంత రిస్క్‌ తీసుకున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహమూ లేదు. తోటి సహోద్యోగులు పెదవివిరిచారు. అయినా.. అన్నపూర్ణ పట్టించుకోలేదు. స్కూల్‌ను, పిల్లల్ని మార్చిపడేశారావిడ.
 
సోషల్‌మీడియాలో..
సర్కారు బడి పిల్లలు బ్రిటీష్‌ ఇంగ్లీష్లో గలగలమాట్లాడేస్తున్నారా? ఎక్కడ, ఏ ఊరు? అంటూ నెటిజన్లు ఆరాతీస్తున్నారిప్పుడు. ఎందుకంటే - తమ క్లాస్‌రూంలో ఆంగ్లం మాట్లాడే పిల్లల వీడియోల్ని తీసి.. ఫేస్‌బుక్‌లో పెట్టారామె. విషయం తెలిసి.. ఒక ఆంగ్లఛానల్‌ కూడా అన్నపూర్ణ కృషి మీద ఒక డాక్యుమెంటరీ తీసింది. ఇంకేముంది? ఎక్కడో తమిళనాడులోని మారుమూలన ఉన్న ఆ స్కూల్‌.. ఒక పెద్ద విశేషమే అయిపోయిందిప్పుడు. ‘‘మా పిల్లలు మాట్లాడే వీడియోలను తిలకించిన ప్రవాస తమిళులు స్పందించారు. సింగపూర్‌లోనున్న ఒక స్నేహితుడు మా పిల్లలకు క్రీడాసామగ్రిని పంపించారు. మరో వ్యక్తి క్లాస్‌రూంలోని పిల్లలకు తలా పదిరూపాయలు మనీఆర్డరు చేశారు. వచ్చే ఏడాదికి ఇప్పటి నుండే అడ్మిషన్లు ఇవ్వమని వచ్చే పిల్లల తల్లితండ్రుల సంఖ్య ఊహించనంత పెరిగింది.
 
ఇదంతా సోషల్‌మీడియా మహిమ’’ అని నవ్వుకుంటూ చెప్పుకొచ్చింది టీచర్‌ అన్నపూర్ణ. ఒకప్పుడు తన మెడ నిండా మిలమిల మెరిసే నగలు ఉండేవి. ఇప్పుడవి వ్యాపారి దగ్గర తాకట్టులో ఉండొచ్చు. కానీ, తన మెడలో పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇస్తున్నందుకు.. వారి తల్లితండ్రుల అభినందనమాలను మూటగట్టుకున్నారు అన్నపూర్ణ. ఈ భాగ్యం ఎంత మంది టీచర్లకు దక్కుతుంది? అందుకే, ఆ చుట్టుపక్కల పల్లెల్లోని వాళ్లంతా అన్నపూర్ణను ‘మా టీచర్‌ బంగారం’ అంటున్నారు.
మా పిల్లలు మాట్లాడే వీడియోలను తిలకించిన ప్రవాస తమిళులు స్పందించారు. సింగపూర్‌లోనున్న ఒక స్నేహితుడు మా పిల్లలకు క్రీడాసామగ్రిని పంపించారు. మరో వ్యక్తి క్లాస్‌రూంలోని పిల్లలకు తలా పదిరూపాయలు మనీఆర్డరు చేశారు. వచ్చే ఏడాదికి ఇప్పటి నుండే అడ్మిషన్లు ఇవ్వమని వచ్చే పిల్లల తల్లితండ్రుల సంఖ్య ఊహించనంత పెరిగింది.
 
-రాళ్లపల్లి రాజావలి