ఆందోళన తగ్గించేందుకే అలాంటి ప్రశ్నలు: సివిల్స్ 14వ ర్యాంకర్ చేకూరి కీర్తి Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఆందోళన తగ్గించేందుకే అలాంటి ప్రశ్నలు: సివిల్స్ 14వ ర్యాంకర్ చేకూరి కీర్తి
నాన్నగారు ఫార్మాస్యూటికల్‌ బిజినెస్‌లో ఉన్నారు. అమ్మ గృహిణి. మాది విశాఖపట్నం అయినా నేను పదో తరగతిలో ఉండగా హైదరాబాద్‌కు వచ్చాం. ఇంటర్‌ తరవాత ఐఐటి మద్రాస్‌లో బిటెక్‌ మెటలర్జీ చేశాను. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌కు వచ్చేసి సివిల్స్‌ ప్రిపరేషన్‌ ఆరంభించాను.
 
ఆంత్రోపాలజీ నా ఆప్షనల్‌ సబ్జెక్టు. మొదటిసారి సివిల్స్‌ రాస్తే సెంట్రల్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌కు ఎంపికయ్యాను. ప్రస్తుతం హైదరాబాద్‌ సర్వీస్‌ టాక్స్‌ కమిషనరేట్‌లో పని చేస్తున్నాను. రెండోసారీ మంచి ర్యాంకు రాలేదు. మూడో ప్రయత్నంలో ఈ ర్యాంకు వచ్చింది. మొదటిసారి పూర్తి స్థాయిలో కోచింగ్‌ తీసుకున్నాను. ఇంట్లో బోర్‌ కొడుతు న్నప్పుడు కూడా మళ్ళీమళ్ళీ శిక్షణకు వెళ్ళాను. ఇక ప్రిపరేషన విధానాన్ని మీతో పంచుకుంటాను.
భిన్నంగా పనులు
గొప్పవాళ్లందరూ భిన్నమైన పనులు చేయరు. అందరూ చేసే పనులనే భిన్నంగా చేస్తారు. నేను ఈ సూత్రాన్ని నమ్ముతాను. పరీక్ష ఏదైనా ఇదే సూత్రం వర్తిస్తుంది.


సివిల్స్‌లో ప్రిలిమ్స్‌ ఆబ్జెక్టివ్‌ టైప్‌ పరీక్ష. ఇందులో భిన్నత్వానికి అవకాశం ఉండదు. అలాంటప్పుడు మన సత్తా అంతా మెయిన్సలో తేలాల్సిందే. ఇక్కడ అందరూ రాసినట్లుగా రొటీనగా కాకుండా ప్రత్యేకత చూపించాలి. జనరల్‌ ఎస్సే, ఆప్షనల్‌ సబ్జెక్టులో అభ్యర్థులు ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. ప్రిపరేషనలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు రెండుమూడు ఉన్నాయి. మనకు ఇష్టమైన సబ్జెక్టులనే ఎక్కువ సేపు చదువుతూ కూర్చోకూడదు. సివిల్‌ సర్వీస్‌లాంటి పరీక్ష రాస్తున్నప్పుడు అన్నింటినీ ఇష్టంగా, అవసరానికి తగ్గట్టు అధ్యయనం చేయాలి. పరీక్ష రాసే విధానం బోర్‌ కొట్టించకూడదు. డయాగ్రమ్స్‌, ఫ్లో చార్టులు, పాయింట్ల రూపంలో రాయాలి. ఉదాహరణలు జోడించాలి. గొప్ప వ్యక్తులు చెప్పిన మాటలను (కొటేషన్స) సందర్భానుసారంగా ఉపయోగించుకోవాలి. సైడ్‌ హెడ్డింగ్స్‌ తప్పకుండా ఉపయోగించాలి. అభ్యర్థులందరికీ ప్రశ్న ఒకటే. రాసే విధానం ఎగ్జామినర్‌ను ఆకట్టుకునేలా, మనదైన విశ్లేషణలను జోడిస్తూ రాయాలి. రొడ్డకొట్టుడు విధానంలో మంచి మార్కులు రావు.
ఇక రెండో విషయం... చదివేటప్పుడైనా, రాసేటప్పుడైనా ఏది ఎంతవరకు అవసరమో చూసుకోవాలి. ఒక ప్రశ్నకు ఎన్ని మార్కులు కేటాయించారు, ఇచ్చిన గడువులో ఏ మేరకు రాయాలో గుర్తించాలి. వచ్చింది కదా అని రాస్తూ కూర్చుంటే ఆ ప్రశ్నకు ఇచ్చిన దానికన్నా అదనంగా మార్కులు వేయరు కదా!
ఆరంభంలోనే అవగాహన
సిలబస్‌, సబ్జెక్టు, కాన్సెప్ట్స్‌, డెవలప్‌ చేసుకోవడంపై పూర్తి స్థాయి అవగాహన మొదట్లోనే ఏర్పరుచుకోవాలి. తరవాత ప్రిపరేషన ఆరంభించాలి. నాలెడ్జ్‌ అందరికీ ఉంటుంది. ఎగ్జిక్యూషన ఎలా చేస్తున్నామనేదే ముఖ్యం. ముఖ్యంగా ప్రిలిమ్స్‌ గట్టెక్కారంటేనే సీరియస్‌ అభ్యర్థుల కింద లెక్క. అయితే రైటింగ్‌ ప్రాక్టీస్‌ సరిగ్గా లేకుంటే మెయిన్సలో రాణించలేరు. అడిగిన ప్రశ్నకు పరిమితమై జవాబు ఉండకూడదు. దాని చుట్టుపక్కల అనేక విషయాలు, కోణాలు ఉంటాయి. వాటన్నింటినీ పరిమిత సమయంలోనే జోడించుకుంటూ రాయగలిగితే మంచి మార్కులు వస్తాయి. ఉదాహరణకు న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నించారనుకోండి. సమస్యలు ఒక్కటే రాస్తే చాలదు. ఆ సమస్యలు తలెత్తడానికి గల కారణాలు, వాటినుంచి బయట పడేందుకు కొన్ని సూచనలనూ కలపాలి. ‘వే ఫార్వార్డ్‌’ అంటే తదుపరి చర్యలను కూడా కలిపి రాయగలగాలి. అప్పుడు మాత్రమే సదరు విషయంపై అభ్యర్థికి సమగ్ర అవగాహన ఉందని ఎగ్జామినర్‌ భావిస్తారు.
ఫీడ్‌ బ్యాక్‌ మస్ట్‌
జనరల్‌ స్టడీస్‌ విషయానికి వస్తే ‘ఇనసైట్స్‌ ఆన ఇండియా’ అనే వెబ్‌సైట్‌ ఒకటి ఉంది. ఇందులో ప్రతిరోజూ వివిధ సమస్యలపై ప్రశ్నలు ఉంటాయి. క్రమం తప్పకుండా వాటిలో కొన్నింటినైనా రాయాలి. సరిగ్గా ఇక్కడే ఒక జాగ్రత్త తీసుకోవాలి. మనం రాసిన దానిపై సీనియర్లతో చర్చించాలి, ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలి. మనం రాసుకుంటూ వెళితే ఏమీ తెలియదు. కొంతమంది అనుభవజ్ఞులతో చర్చించినప్పుడు మాత్రమే మనకు తెలియని అంశాలు, రాసే విధానం, తత్సంబంధ కోణాలు బయటపడతాయి. వాటిని కలుపుకొంటూ జవాబులు రాసే విధానాన్ని మెరుగుపర్చుకోవాలి.
ఎథిక్స్‌ అంటే పూర్తిగా పర్సనలైజ్‌డ్‌ వ్యవహారం. చేసిన మంచి పనులు, చెడ్డపనులు, రోల్‌ మోడల్‌, ఆనందం తదితరాలన్నీ వస్తాయి. అడిగే ప్రశ్నలు కూడా సూటిగా, మనల్ని గురిచేసినట్టు ఉంటాయి. ప్లేటో, అరిస్టాటిల్‌ వంటి థింకర్స్‌ను కోట్‌ చేస్తూ రాయాలి. నావరకు ఆ విషయంలో కొంత వెనకపడ్డాననే చెప్పాలి.
ముఖ్యంగా మెయిన్సలో ఏ పేపర్‌ అయినా అడిగిన వాటిలో సగం ప్రశ్నలకు జవాబులు తెలిస్తే గొప్ప. మిగతావి అస్సలు తెలియవు. మనం ప్రిపేరైన తీరులోనే ప్రశ్నలు అడగాలని ఎక్కడా లేదు. రెండు మూడు కాన్సెప్టులు కలిపి లేదంటే ఒక విషయం నుంచి డిఫరెంట్‌గా ప్రశ్నలు అడగవచ్చు. సమయం తక్కువగా, రాయాల్సింది ఎక్కువగా ఉంటుంది. మొదట ప్రశ్నను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకోసం కొంత ప్రశాంతంగా ఉండగలగాలి. ఒకసారి ప్రశ్న అర్థమైతే జవాబు దానంతట అదే వస్తుంది. పదాల వినియోగం నుంచి, వాక్యనిర్మాణం వరకు పొదుపు పాటిస్తూ జాగ్రత్తగా రాసుకుంటూ వెళితే మెయిన్సలో విజయం సాధించవచ్చు.
నన్ను చత్తర్‌సింగ్‌ బోర్డు ఇంటర్వ్యూ చేసింది. ప్రస్తుతం నేను పనిచేస్తున్న డిపార్ట్‌మెంట్‌పై ఎక్కువ ప్రశ్నలు అడిగారు. కొంత హుందాగా ఉంటుందనే ఉద్దేశంతో ఇంటర్వ్యూ కోసం చీర కట్టుకుని వెళ్లాను. అది ‘చందేరి కాటన’ చీర. నేను కట్టుకున్న చీర కాటనా అని ప్రశ్నించారు. మన దగ్గర తయారయ్యే చీరల్లో పోచంపల్లికి మంచి పేరుంది. నాకైతే చీరల వెరైటీలు అంతగా తెలియవు. నేను తెలుగు వ్యక్తిని కాబట్టి ఇంటర్వ్యూ సమయంలో కట్టుకున్న చందేరీని, మన ప్రాంత ప్రత్యేకత అయిన పోచంపల్లితో పోలుస్తూ ఆ రెంటికి ఉన్న తేడా ఏమిటన్నారు. చెప్పకపోయేసరికి, ‘ఈ తరం అమ్మాయి’, చీరల గురించి ఏమీ తెలియదు అని బోర్డు చైర్మన్‌ అనేసరికి సభ్యులంతా పెద్దపెట్టున నవ్వారు.
ఇంటర్వ్యూ అనగానే ఎవరికైనా సరే కొంత ఆందోళన ఉంటుంది. దానినుంచి బయటపడేయానికి, అభ్యర్థులను కూల్‌గా ఉంచడానికి ఇలా సాధారణ ప్రశ్నలు వేస్తుంటారు. ఇలా జనరల్‌ విషయాలతో మొదలైన ఇంటర్వ్యూ, అరగంటకు పైగా సహృద్భావ వాతావరణంలో జరిగింది. చాలా ప్రశ్నలకు తెలియదని నేరుగానే చెప్పాను. తెలియనప్పుడు నటించకూడదు. బ్లఫ్‌ చేయకూడదు.
 
ఆందోళన సహజమే
నిరాశ నిస్పృహలకు ఎన్నడూ లోనుకాలేదని చెప్పడం అబద్ధమే అవుతుంది. ఈసారి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందురోజు ఏ కారణం లేకుండానే అమ్మమీద అరిచేశాను. అప్పుడు అమ్మ, నాన్న నన్ను దగ్గర కూర్చోపెట్టుకుని ఐఎఎస్‌ ఒక్కటే జీవితం కాదని విడమర్చి చెప్పారు. ఆందోళనకు గురికావద్దని సున్నితంగా నచ్చచెప్పారు. నాకు దైవభక్తి ఎక్కువ. అలాగని గాల్లో దీపం పెట్టి, దేవుడా నువ్వే దిక్కు అని కూర్చోను. మన కృషి తోడైతే దేవుడు కూడా సహకరిస్తాడు. మెయిన్సలో ప్రతి పేపర్‌లో మంచి మార్కులు వస్తేనే ముందు వరసలో ఉంటాం. ఒక్కోసారి ‘దేవుడా ఇదేమిటి? ఐఐటిలో చదివిన నేను ఇప్పటివరకు సెటిల్‌ కాకపోవడం ఏమిటి?’ అనుకున్న రోజులూ ఉన్నాయి. 
 
ఒంటరి పోరాటం మంచిది కాదు
మనకు మనం కూర్చుని సొంతగా ప్రిపేరవుదామంటే సివిల్స్‌ వంటి పరీక్షలకు కుదరదండి. లక్షల మందితో పోటీపడి వందల సంఖ్యలోకి మరీ ముఖ్యంగా రెండు అంకెల్లోకి మెరిట్‌లో చేరుకోవాలంటే సీనియర్ల సహకారం చాలా అవసరం. సివిల్స్‌లో విజయం సాధించిన లేదంటే కోచింగ్‌ సంస్థలకు చెందిన నిపుణులు ఇచ్చే సలహాలన్నీ చాలా ప్రాక్టికల్‌గా ఉంటాయి. మనం చేస్తున్న తప్పులను సాధికారికంగా ఎత్తి చూపగలుగుతారు. మెరుగు పర్చుకునేందుకు సూచనలిస్తారు. ఆర్థికంగా, మిగతా విషయాలపరంగా కుటుంబ సభ్యుల మద్దతు చాలా అవసరం. నావరకు అమ్మా, నాన్న చివరకు తమ్ముడు కూడా మంచి మద్దతు ఇచ్చారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి బయట పడేందుకు సహకరించారు. ఇలాంటి పరీక్షలు రాసే వారికి నాదొక్కటే సలహా. పట్టుదల అవసరం. ధైర్యంగా ఉండాలి. పరీక్షకు ప్రిపరయ్యే పద్ధతంటే మాత్రం ఎవరి స్టయిల్‌ వారిదే.